విష ప్రయోగంతో 60 వానరాలు మృతి
మహబూబాబాద్ జిల్లాలో శనిగపురం శివారులో విషప్రయోగం కారణంగా 60 వానరాలు మృతి చెందాయి. వీటికి అటవీ శాఖ అధికారులు సాముహిక అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శనిగపురం గ్రామ శివారు గుట్టలో విషప్రయోగంతో కోతులను హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నాయకులు హనుమంతుని ప్రతిరూపంగా కొలిచే వానరాలను ఇలా విషప్రయోగం చేసి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వానరాలను హతమార్చడం హింసాత్మకమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడడం మానవత్వానికి విరుద్దమని నాయకులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు ఇలాంటి క్రూరత్వానికి తెగబడిన వారిని త్వరలో గుర్తిస్తామని తెలిపారు. వానరాల మృతిపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.