చాక్లెట్ ఆశ చూపి బాలికపై అత్యాచారం...
చాక్లెట్ ఆశ చూపి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. అనంతరం ఆ కామాంధుడు పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతం గ్రీన్ పార్క్ కాలనీలో జరిగింది. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతం గ్రీన్ పార్క్ కాలనీలో రమావత్ శ్రీను నాయక్(24) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన శ్రీను.. దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది.
ఈనేపథ్యంలో శుక్రవారం శ్రీను కుటుంబ సభ్యులు ఓ వివాహ వేడుకకు వెళ్లారు. దీంతో షాపును చూసుకునేందుకు శ్రీను అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో తమ షాపు ముందు సోదరుడితో కలిసి ఆడుకుంటున్న బాలిక(9)కు చాక్లెట్ ఆశ చూపాడు.
చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను షాపులోకి తీసుకెళ్లాడు. బాలిక వెంట వస్తున్న సోదరుడిని భయపెట్టి ఇంటికి పంపేశాడు. దీంతో చెల్లి ఎక్కడ? అని కుమారుడిని తల్లి ప్రశ్నించింది. శ్రీను ఇంటిలోకి తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె ఒక్క పరుగున అక్కడకు చేరుకుంది. అప్పటికే బాలికపై అత్యాచారానికి పాల్పడిన శ్రీను ఘటనాస్థలం నుంచి పత్తాలేకుండా పారిపోయాడు.
కానీ, కుమార్తె మర్మాంగం నుంచి రక్తస్రావం కావడాన్ని గుర్తించిన తల్లి... కుమార్తెను తొలుత ప్రైవేటు ఆసుపత్రికీ, అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.