శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (12:29 IST)

తూర్పుగోదావరి జిల్లాలో కొత్తరకం కరోనా!

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొత్తరకం కరోనా వైరస్‌ కలకలం రేపింది. యుకె నుంచి ఢిల్లీ వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు క్వారంటైన్‌లో పెట్టారు. కానీ ఆమె అక్కడి నుంచి తప్పించుకుని రాజమండ్రి బయల్దేరింది.

రాజమండ్రి రూరల్‌ మండలం రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్‌ మహిళ ఈనెల 22న యుకె నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆమెను రిసీవ్‌ చేసుకునేందుకు ఆమె కుమారుడు ఢిల్లీ వెళ్లారు. యుకెలో కరోనా పరీక్షలు చేయించుకున్నా అక్కడ ఫలితాలు రాకుండానే ఆమె బయలుదేరి భారత్‌కు వచ్చినట్టు సమాచారం.

ఇక్కడ కూడా ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు వచ్చేవరకు ఆమె అక్కడే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా.. అక్కడ నుంచి పరారై రాజమండ్రి రావడానికి బయలుదేరారు. ఆమె ఢిల్లీ నిజాముద్దీన్‌ ట్రైన్‌ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు.

తొలుత కొత్త కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన ఢిల్లీ వైద్యాధికారులు వెంటనే ఎపి ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫోను, ఆమె కుమారుడు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండడంతో అధికారులు ఆమె పాస్‌పోర్టు ఆధారంగా అడ్రస్‌ను గుర్తించి, వెంటనే ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమెను పట్టుకునేందుకు చర్యలు చేట్టారు.

రాజమండ్రి అర్బన్‌ పోలీసులను, వైద్య విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఆమె ఆచూకీని వరంగల్‌ సమీపంలో తెలుసుకున్నారు. అక్కడి నుంచి మహిళ, ఆమె కుమారుడ్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌కు పంపనున్నారు.

వారి నుంచి శాంపిల్స్‌ సేకరించి పుణె పంపిస్తారని సమాచారం. అధికారులు ఈ వ్యవహారం మొత్తం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే దీని గురించి ఎవరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.