సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:18 IST)

కోవిడ్ "‌‌రెండో ద‌శ" వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త : సీఎం జగన్

కోవిడ్ వైరస్ రెండో దశ వస్తోందన్న తాజా హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారుల‌కు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం తాడేప‌ల్ల‌ిలోని క్యాంపు కార్యాల‌యంలో సమీక్ష నిర్వ‌హించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం కమిషనర్ కాటమనేని భాస్కర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఏ.మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు. 
 
ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. బ్రిటన్‌ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారని.. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. సూపర్‌ స్పెషాలిటీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలను ఈ సంద‌ర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాలపై వివరాలు అందించారు. 
 
వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని.. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉన్నారని అధికారులు వెల్లడించారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్లు, అవి పనిచేస్తున్న తీరుపై బ్రిటన్‌ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వచేసే స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు, ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. దీనికి ఎలాంటి మౌలిక వసతులు కావాలన్న దానిపై కూడా ఆలోచనలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 
 
గ్రామాల్లోకి డాక్టర్లు వెళ్లి వైద్యం చేసేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ‘‘ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలు ఉండేలా చూడాలి. అంచనాగా ప్రతి పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు చొప్పున నలుగురు డాక్టర్లు ఉన్నారనుకుంటే .... ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలి. ప్రతి నెలకు రెండు సార్లు డాక్టర్‌ తనకు నిర్దేశించిన అదే గ్రామాలకు వెళ్లాలి. దీంతో గ్రామాల్లో ప్రజలకు, వారి ఆరోగ్య పరిస్థితుల మీద డాక్టర్‌కు అవగాహన ఏర్పడుతుంది. ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారో అనే దానిపై కూడా వైద్యుడికి అవగాహన వస్తుంది. 
 
వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశావర్కర్‌లు డాక్టర్‌తో ఉంటారు. 104 వాహనాల ద్వారా వారికి చికిత్స అందించడం సులభం అవుతుంది. హోం విజిట్స్‌ కూడా చేయాలి. అవసరం అనుకుంటే 104లనుకూడా పెంచుకోవాలి. డాక్టర్‌  సేవలు అందించడానికి విలేజ్‌ క్లినిక్‌ కూడా వేదికగా ఉంటుంది. కొంతకాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్‌కు పూర్తి అవగాహన ఏర్పడుతుంది.దీంతో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగానే ఉండాలి. 
 
ప్రజలకు చికిత్స అందించడానికి కూడా, అవసరమైన మందులు సమకూర్చడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యకార్డుల్లో నమోదుకూ అవకాశం ఏర్పడుతుంది. మెరుగైన వైద్యం కోసం సరైన ఆస్పత్రికి వారు రిఫరెల్‌ చేయగలుగుతారు. ఈ వ్యవస్థ కోసం తగిన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఆరోగ్య సేవలు సక్రమంగా అందుతాయి. అవసరమనుకున్న చోట మండలానికి రెండో పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలి. దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి. ఈ వ్యవస్థను ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకు వస్తారన్న దానిపై తేదీని కూడా ఖరారు చేయాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.
 
ఆరోగ్యం రంగంలో నాడు - నేడు స్థితిగతులపై సీఎం సమీక్ష 
2021 డిసెంబర్ నాటికి పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు, 2023 జూన్‌ నాటికి కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేస్తామని  ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఐటీడీఏల పరిధిలోని ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించే దిశగా ప్రయత్నిస్తున్నామని సీఎం జ‌గ‌న్‌కు అధికారులు వివరించారు. పాడేరు, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఈ వారంలో రివర్స్ టెండరింగ్‌కు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి డిసెంబర్ నెలాఖరులోగా టెండర్లకు ఆహ్వానించాలని, మిగిలిన 12 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 
 
వైఎస్సార్‌ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల పనులు జనవరి నెలాఖరుకు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. పీహెచ్‌సీల్లో నాడు-నేడు పనులు 2021 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 2021 డిసెంబర్ కల్లా ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలని, ఆస్పత్రులను ప్రమాణాలతో నడపడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ అమలు తీరును సీఎం సమీక్షించారు. ఆరోగ్య కార్డుల పంపిణీ, ఆరోగ్య అవసరాలను పరిశీలించారు.
 
 ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో లేకుండా తీసుకుంటున్న చర్యలపై కూడా సమీక్షించారు. ఆరోగ్య ఆసరా కింద ఇప్పటి వరకు 836 ప్రొసీజర్లకు ఆర్థిక సాయం చేస్తున్నామని, అదనంగా 638 ప్రొసీజర్లకు సాయంపై చర్యలు తీసుకుంటున్న‌ట్లు అధికారులు వివరించారు. చికిత్స అనంతరం రోగి డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఆరోగ్య ఆసరా అందుతుందని, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 
 
ఆరోగ్యశ్రీ హెల్ప్‌డెస్క్‌లు పేషెంట్లకు సంపూర్ణ సేవలు అందించేలా చూడాలని సీఎం సూచించారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. ‘‘పేషెంట్ల పట్ల మనం సానుకూల దృక్పథంతో ఉండాలి. ఆరోగ్యశ్రీ కింద రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలి. డబ్బు వసూలు చేసిన ఆస్పత్రుల ప్యానల్ తొలగించి చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రులపై రోగికి అవగాహన కల్పించాలి. అంబులెన్స్‌ల నిర్వహణ పూర్తి సమర్ధవంతంగా ఉండాలి. అంబులెన్స్‌లు కండిషన్‌లో ఉండేలా క్రమం తప్పకుండా పరిశీలించాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.