శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: బుధవారం, 12 జూన్ 2019 (16:18 IST)

నా భర్త లేడు వచ్చేయ్... అంటూ ప్రియుడికి ఫోన్... అతడు రాగానే...

తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని తెలిసిన ఓ భర్త పక్కా ప్లాన్ ప్రకారం ఆమె ప్రియుడిని హత్య చేశాడు. అది కూడా భార్యను అడ్డు పెట్టుకుని ఆ పని కానించేశాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లా వి.కోటలో జరిగింది.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తిమ్మరాజుపురంకి చెందిన 30 ఏళ్ల రవి దినసరి కార్మికుడుగా బతుకు వెళ్లదీస్తున్నాడు. ఐతే అతడికి వచ్చే డబ్బు కుటుంబ అవసరాలకి సరిపోతుండకపోవడంతో భార్యను కూడా ఏదేని పనిలో కుదర్చాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతడికి తాపీ మేస్త్రీ శివతో పరిచయం ఏర్పడింది. దాంతో తన భార్య లతకి పని ఇప్పించాలని అభ్యర్థించాడు. 
 
శివ ఆమెకి తనవద్దే పని ఇచ్చి రోజువారీ డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య చనువు ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని కనిపెట్టిన రవి భార్య లతను మందలించాడు. మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. కానీ ఆ మాటలను భార్య పట్టించుకోలేదు. ప్రియుడితో సంబంధం సాగిస్తూనే వుంది. మంగళవారం నాడు కూడా ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతుండగా గమనించిన రవి ఆమెను నిలదీసాడు. 
 
ఆమెలో ఇక మార్పు రాదనుకుని భార్యను ఒత్తిడి చేసి ప్రియుడికి ఫోన్ చేయించాడు. దాంతో ఆమె నా భర్త ఇంట్లో లేడు... వచ్చేయ్ అంటూ ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్ అందుకున్న శివ అక్కడికి రాగానే వెనుకనే నక్కి వున్న రవి బండకర్రతో అతడి తలపై మోదీ చంపేశాడు. ఆ తర్వాత అతడి శవాన్ని మూటగట్టుకుని ఊరి బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఐతే విషయాన్ని స్థానికులు గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయగా అసలు నిజం వెలికి వచ్చింది. రవి, లతలను ఇద్దరినీ అరెస్ట్ చేశారు.