ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (08:30 IST)

అమరవీరుడు జశ్వంత్ రెడ్డి కుటుంంబానికి రూ.50 లక్షలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువ జవాను కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ అమరజవాను జశ్వంత్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 
 
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాకు జవాను మరుపోలు జశ్వంత్‌రెడ్డి మృతి చెందారు. గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 
 
ఈ కాల్పుల్లో జస్వంత్​ రెడ్డితో పాటు మరో భారత జవాన్ వీరమరణం పొందారు. ఈ ఘటనతో జవాన్ జస్వంత్​ సొంతూరు బాపట్ల మండలం దరివాద కొత్తవాసి పాలెం వాసులు శోకసముద్రంలో మునిగిపోయారు. 
 
జశ్వంత్ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. జశ్వంత్ చిరస్మరణీయుడని కొనియాడారు. దేశ రక్షణలో భాగంగా కాశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటంచేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. 
 
మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 
 
జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం తెలియగానే.. ఈ విధంగా స్పందించారు.