ఏపీలో కరోనా విజృంభణ.. ఇద్దరు విద్యార్థులకు కరోనా.. పాఠశాల మూసివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులకు రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో పాఠశాల యాజమాన్యం ఈరోజు నుంచి స్కూల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఒక్క రోజు 147 మంది కరోనా బారిన పడ్డారు. 22,604 నమూనాలను పరీక్షించగా.. 0.65శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నిర్ధారణ అయ్యాయి. ఇక కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు.