గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (09:56 IST)

మార్చి 31తో స్పెషల్ ట్రైన్స్ నిలిపివేత? క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రైలు సర్వీసులను నిలిపివేశారు. కేవలం కోవిడ్ స్పెషల్ పేరుతో పరిమితి సంఖ్యలో రైళ్లను నడుపుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందని చెబుతున్నారు. దీనికి నిదర్శనమే ప్రతి రోజు 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెలాఖరు నుంచి కోవిడ్ స్పెషల్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ నిలిపివేయనుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 
 
దీనిపై ప్రభుత్వ మీడియా సంస్థ పీఐబీ.. ఫ్యాక్ట్ చెక్ పేరుతో రైల్వే శాఖ వద్ద వివరణ కోరగా, రైల్వే శాఖ ఈ ప్రచారాన్ని కొట్టివేసింది. నిరాధారమైన వార్తలని, కోవిడ్ ప్రత్యేక రైళ్లను నిలిపివేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 
 
మరోవైపు, దిక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను పునరుద్ధరించింది. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ రైళ్లతోపాటు  తిరుపతి - జమ్ముతావి - తిరుపతి రైళ్లను దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. 
 
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రైలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రతీ రోజు నడవనుండగా, రెండో తేదీ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 
 
అలాగే, తిరుపతి - జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి ప్రతి మంగళవారం అందుబాటులోకి రానుండగా, అదే రైలు తిరుగు ప్రయాణంలో 9వ తేదీ నుంచి  ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
 
ఇక, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్టణం - లింగంపల్లి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును జూన్ 30 వరకు, లింగంపల్లి - విశాఖపట్టణం మధ్య నడిచే రైలును జులై 1 వరకు పొడిగిస్తూ తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది.