సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (13:34 IST)

సంపూర్ణ లాక్డౌన్ విధించే పరిస్థితి తీసుకరావొద్దు : మహా సీఎం ఉద్ధవ్

మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఓ హెచ్చరిక చేశారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో రాష్ట్ర ప్రజలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించే పరిస్థితిని కల్పించవద్దని కోరారు. ఇదే తన "చివరి హెచ్చరిక" గా పరిగణించాలని సూచించారు. 
 
రాష్ట్రంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు తమ ప్రాంగణంలో అవసరమైన అన్ని కొవిడ్‌-19 మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. లాక్డౌన్ వంటి కఠినమైన చర్యలను అమలు చేయమని రాష్ట్రాన్ని బలవంతం చేసేలా ప్రవర్తించవద్దని ఆయన కోరారు. 
 
సోమవారం షాపింగ్ సెంటర్లు, హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొవిడ్‌-19 నిబంధనల పట్ల అవాంఛనీయమైన వైఖరి ఏర్పడటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్రంలో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూడాలని కోరారు. 
 
"కఠినమైన లాక్డౌన్ విధించాలని ప్రభుత్వాన్ని బలవంతం చేయవద్దు. ఇది చివరి హెచ్చరికగా పరిగణించండి. అన్ని నియమాలను పాటించండి. స్వీయ క్రమశిక్షణ, ఆంక్షల మధ్య వ్యత్యాసం ఉన్నదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి" అని ఠాక్రే పేర్కొన్నారు. తమ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలుకు అనుకూలంగా లేదని, అయితే ప్రజలు సహకరిస్తే బాగుంటుందని ఆయన కోరారు. 
 
కాగా, మహారాష్ట్రలో శనివారం 15,602 కొవిడ్-19 కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 22,97,793 కు, మరణాల సంఖ్య 52,811 కు చేరుకుంది. గత వారం కేంద్ర బృందం ముంబైని సందర్శించి.. అక్కడి ప్రజలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు మార్గదర్శకాలను పాటించడం లేదని గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.