20 వేలకు పైగా కరోనా కేసులు-దేశంలో మళ్లీ లాక్ డౌన్
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుత భారీగా పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే మళ్లీ లాక్‌డౌన్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్‌లో కరోనా కేసులు ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరుగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా దాదాపు 20వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా వారికి కూడా మళ్లీ కరోనా సోకుతుంది.
అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ... మరింత బలంగా తయారవుతోంది. అందుకే కేసులు పెరుగుతున్నాయి. ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ ఉందని తేలింది. అది చాలా వేగంగా వ్యాపించే రకం కాబట్టి ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్, మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో పుణే జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పుణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే నడపాలని ఆదేశించారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రిపరేషన్స్‌కు ఈ ఆంక్షలు అడ్డుగారావని పేర్కొన్నారు.
మరోవైపు అలాగే నాగ్‌పూర్‌లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో వైరస్ కట్టడిలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నితిన్ రావుత్ ప్రకటించారు. అనంతరం పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.