గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (10:57 IST)

చివరి రోజు ప్రచారంలో కొడాలి నానిపై రాళ్ల వర్షం.... ప్రచార వాహనం దిగి ఒంటరిగా వెళ్లిపోయిన ఎమ్మెల్యే

kodali nani
చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజున మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై రాళ్లు రువ్వారు. అలాగే, వైకాపాకు చెందిన రెండు వర్గాల ప్రజలు ఆయన సక్షమంలోనే వాగ్వాదానికి దిగారు. దీంతో కొడాలి నాని ప్రచార వాహం దిగి వెళ్లిపోయారు. తన ప్రచారంలో భాగంగా శనివారం నాని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు బస్టాండ్‌సెంటర్‌కు చేరుకున్నారు. ఈ గ్రామంలో అధికార పార్టీకి రెండు వర్గాలున్నాయి. అందులో ఒక వర్గానికి చెందిన త్రిపురనేని ప్రసాద్‌, మరికొందరిని నాని ముఖ్య అనుచరులైన పాలేటి చంటి, కసుకుర్తి బాబ్జీలు ఎమ్మెల్యే వాహనంపైకి ఎక్కించారు. 
 
మరో వర్గానికి చెందిన ఎస్సీ సర్పంచి మేడేపల్లి రవికుమార్‌, ఉప సర్పంచి త్రిపురనేని సురేశ్‌, సొసైటీ అధ్యక్షుడు దుగ్గిరాల శేషు వర్గీయుల్ని విస్మరించారు. ప్రసాద్‌ వర్గీయులతో కలిసి నాని నూజెళ్ల రహదారిలోని కొత్తపేట తదితర ప్రాంతాల్లో ప్రచారం చేసి బస్టాండ్‌ సెంటర్‌కు తిరిగి చేరుకున్నారు. ఈలోగా సర్పంచి రవి, శేషు వర్గీయులు పాలేటి చంటి, బాబ్జీలతో వాగ్వాదానికి దిగారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీబలోపేతానికి కృషి చేస్తున్న తమను వదిలేసి, ఏమీ చేయని వారిని ఎమ్మెల్యే ప్రచార వాహనం ఎక్కించుకుని తిరుగుతారా అంటూ మండిపడ్డారు. 
 
నాని సమక్షంలోనే ఇరు వర్గాలూ వాగ్వాదానికి దిగాయి. ఈ విషయంపై రవి వర్గీయులు నానిని నిలదీశారు. కష్టపడే వారికి పార్టీలో విలువ లేదని, షో చేసేవారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ నిరసించారు. దీంతో ఎమ్మెల్యే వారికి ఏమీ చెప్పలేక.. ప్రచారాన్ని ఆపివేసి, ఒక్కరే తన వాహనం ఎక్కి గుడివాడ వైపు వెళ్లిపోయారు. ఈ వివాదంతో బస్టాండ్‌ సెంటర్‌లో పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. 
 
ఈ నెల 10న నాని ప్రచారం నిమిత్తం గుడివాడ మండలం మల్లాయపాలెంలోని శ్రీకాళహస్తీశ్వర (వాంబే) కాలనీలో పర్యటించారు. స్థానికంగా ఉన్న గుడి వద్దకు వచ్చిన సమయంలో ఆయనపైకి గుర్తుతెలియని వ్యక్తులు ఆరు రాళ్లు విసిరినట్లు తెలిసింది. అవి నాని సెక్యూరిటీ సిబ్బందికి, ఓ మహిళా కార్యకర్తకు తగిలాయని సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకొని, వెంటనే వదిలేశారని ప్రచారం సాగుతోంది.