మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:24 IST)

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం - ఆ జట్టు రద్దు.. గవర్నర్ ఆమోదం

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జ్యూడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ గత వైకాపా ప్రభుత్వం 2019లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యూడీషియల్ ప్రియూ పారదర్శక) చట్టాన్ని తీసుకొచ్చింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని జ్యూడీషియల్ ప్రియూ న్యాయమూర్తిగా నియమించింది. 
 
రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యూడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పరిశీలించాలని నాడు జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూడీషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర కేబినెట్ ఓ అభిప్రాయానికి వచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టెండర్ల జారీలో కేంద్ర మార్గదర్శకాలు, విజిలెన్స్ కమిషన్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తుండటంతో ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ నజీర్ ఆమోదముద్ర వేశారు.