మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:10 IST)

ఏపీలో చిన్నారుల అదృశ్యం.. ఏమయ్యారు..?

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చిన్నారుల అదృశ్యమైన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకే జిల్లాలో ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 24న రాయవరంలో చైతన్య అనే ఐదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చైతన్య తల్లిదండ్రులు లోవరాజు, గంగాభవాని స్థానిక ఇటుక బట్టీల వద్ద పనిచేస్తుంటారు. 
 
ఆదివారం బట్టీల వద్ద ఆడుకుంటుండగా చైనత్య కనిపించకుండా పోయాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా చైనత్య ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
 
రాయయవరం పరిసర గ్రామాలను జల్లెడపట్టారు. అలాగే తల్లిదండ్రులతో పాటు బంధువులను విచారించారు. బట్టీల వద్ద పనిచేసే సమయంలో ఎవరితోనైనా గొడవలు జరిగాయా..? ఆర్ధిక వివాదాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో విచారణ జరిపారు. 
 
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం మిస్టరీగా మారింది. మారేడుమిల్లి మండలంలో ఇద్దరు గిరిజన అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మారేడుమిల్లి పంచాయతీ పరిధిలోని మూసూరు గ్రామానికి చెందిన మూడేళ్ల హర్షిణి, రెండున్నరేళ్ల శ్రీ వైష్ణవి ఈనెల 22న అదృశ్యమయ్యారు. 
 
గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటుండగా కనిపించకుండా పోయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. చిన్నారులు ఆడుకుటుండగా ఎవరైనా ఎత్తుకెళ్లారా లేక.. చుట్టూ దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి దారితప్పి వెళ్లిపోయారా..? అనే కోణంలో విచారిస్తున్నారు.