సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (10:16 IST)

పంచాయతీ పోరు : నిఘా బాధ్యత సంజయ్‌కు అప్పగించిన నిమ్మగడ్డ

ఏపీలో నాలుగు దశల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. పైగా ఈ నిఘా పర్యవేక్షణ బాధ్యతలను పోలీస్ ట్రైనింగ్ ఐజీ ఎన్. సంజయ్‌కు అప్పగించింది. ఆయన పేరును డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రతిపాదించగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కూడా ఆమోదముద్ర వేశారు. 
 
ఆ తర్వాత కమిషనరు నిమ్మగడ్డతో సంజయ్ సమావేశమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై చర్చించారు. గత మార్చిలో పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని భద్రత, బందోబస్తు ఎలా ఉండాలి.. సమస్యాత్మక గ్రామాల్లో బలగాల మోహరింపు, సమస్యలు సృష్టించే వ్యక్తుల బైండోవర్‌, డ్రోన్లతో పర్యవేక్షణ, నిఘా యాప్‌ గురించి ప్రజల్లో చైతన్యం, హద్దులు దాటిన వారిపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. 
 
'నిఘా' యాప్‌ను తయారు చేసి ఎవరు అక్రమాలకు పాల్పడినా ప్రజలే వీడియోలు, ఫొటోలు తీసి అందులో పెట్టేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని మీడియాతో పాటు అన్ని మార్గాల్లోనూ జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కమిషనర్‌ సూచించినట్లు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో జరిగిన హింస, పల్నాడులో గత ఏడాది ఎన్నికల సందర్భంగా దాడులు, ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు జరిగిన దృష్ట్యా పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని ఐజీని ఆదేశించినట్లు సమాచారం. 
 
ఆ తర్వాత డీజీపీ, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, నిఘా విభాగం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కాగా.. 13 జిల్లాల ఎస్పీలతో డీజీపీ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒక్క పంచాయతీలోనూ చిన్న ఘటన కూడా జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఐజీ సంజయ్‌తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం పంచాయతీల్లో సమస్యాత్మకమైన వాటి జాబితా సిద్ధంగా ఉన్నందున బైండోవర్లు, బందోబస్తు, అదనపు బలగాల మోహరింపుపై ఎస్పీల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని పలు సూచనలు చేసినట్లు సమాచారం. 
 
మరోవైపు, ఉత్తరాంధ్రలో జన్మించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ అనంతపురంలో ఎక్కువ కాలం పనిచేశారు. గుంటూరు ఐజీగా పనిచేశారు. ఇప్పుడు ట్రైనింగ్‌ విభాగం ఐజీగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా ఆయనకు అవగాహన ఉంది. టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో హింస, బెదిరింపులు, ఇతరత్రా ఉల్లంఘనలు పర్యవేక్షించే బాధ్యతలు ఆయనకు అప్పగించారు.