శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (09:38 IST)

నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2800 కోట్లను విడుదల చేసింది. ఈ సొమ్మును 49,43,590 రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి యేడాది రూ.13,500 సాయం చేస్తున్న సంగతి విదితమే. ఇందులోభాగంగా, తొలివిడతలో గత నెలలో ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.875 కోట్లను జమ చేశారు.
 
ఇపుడు మరో రూ.5500 చొప్పున ప్రతి రైతుకు జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,800 కోట్లను విడుదల చేసింది. అంటే తొలివిడతగా మొత్తం రూ.7500 జమ చేసినట్టు అవుతుంది.
 
శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నగదు జమ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది.