బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (20:09 IST)

ఆర్థిక మోసాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి : ఆదిత్యనాథ్ దాస్

డిజిటల్ లెండింగ్ యాప్/ఆన్‌లైన్ ఋణాలు మంజూరు యాప్‌ల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ప్రజలకు వజ్ఞప్తి చేశారు. శుక్రవారం రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం(ఎస్ఎల్సిసి)అమరావతి సచివాలయం సీఎం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన జరిగింది. 
 
ఈ సమావేశంలో ప్రధానంగా అగ్రిగోల్డు, అక్షయ గోల్డు, హీరా గ్రూప్, కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆదర్శ్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు తదితర చిట్‌ఫండ్/కంపెనీలపై నమోదైన కేసులపై సమీక్షించారు. అలాగే అన్ రిజిస్టర్డ్, బోగస్ చిట్ ఫైనాన్స్ కంపెనీలు మోసాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో డిజిటల్ లెండింగ్ ఏజెన్సీలు ఎక్కవై ప్రత్యేక యాప్‌లు ద్వారా ఆన్‌లైన్‌లో ఋణాలు మంజూరు చేస్తామని ప్రజలను మోసం చేయడం జరుగుతోందని అలాంటి మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. 
 
ఎక్కడైనా ఏదైనా కంపెనీ లేదా సంస్థ యాప్ ద్వారా అలాంటి మోసపూరిత చర్యలతో మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టంచేశారు. అలాంటి మోసాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ జరిపి కేసులు నమోదు చేసి సకాలంలో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను సిఎస్ ఆదేశించారు.
 
అదేసమయంలో బోగస్ చిట్ ఫండ్ లేదా ఫైనాన్స్ కంపెనీల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు విస్తృత అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్బిఐతో పాటు పోలీస్, రిజిష్ట్రార్ ఆఫ్ చిట్స్, సంబంధిత శాఖల అధికారులను సిఎస్ ఆదిత్యానాథ్ ఆదేశించారు.
 
వివిధ ఫైనాన్స్ కంపెనీలు,చిట్ ఫండ్ కంపనీల వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు వీలుగా హోం,న్యాయ,సిఐడి తదితర విభాగాలు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు. 
 
ఇప్పటికే వివిధ ఫైనాన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలపై నమోదైన కేసులను సత్వరం పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆర్బిఐ, సిఐడి తదితర విభాగాలకు చెప్పారు.
 
ప్రజల సొమ్ముకు భద్రత కల్పించడంతో పాటు నకిలీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోకుండా ఉండేందుకు పెద్దఎత్తున అవగాహన పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా ఆర్బిఐ చర్యలు చేపట్టాలని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ సూచించారు. 
 
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ నిఖిల సమావేశానికి స్వాగతం పలికి మాట్లాడుతూ రిజిష్టర్ కాని ఫైనాన్స కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీల మోసాలకు ప్రజలు గురికాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. 
 
ఇప్పటికే ఆర్బిఐ మోసపూరిత  ఫైనాన్స్ కంపెనీల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలు కూడబెట్టే సొమ్ముకు భద్రత కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
 
ఈ సమావేశంలో ఆర్బీఐ జియం వై.జయకుమార్ అజెండా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే గత డిశంబరులో జరిగిన 20వ ఎస్ఎల్సీసీ సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను వివరించారు. సిఐడి అదనపు డిజి సునీల్ కుమార్ మాట్లాడుతూ వివిధ కంపెనీలు మోసాలకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసుల వివరాలను తెలియజేశారు. 
 
ఈ సమావేశంలో సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన రెడ్డి, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ బాబు ఏ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి సునీత, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎజియంలు పద్మ పద్మనాభన్, ఉదయ్ కృష్ణ, మోహన్, డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ ఎస్సి మెహతా, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు.