1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (17:43 IST)

ఏపీలో 218 కరోనా కేసులు.. కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్నాక కరోనా సోకితే..?

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 218 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్‌ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదని పేర్కొంది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 892740కు చేరింది. ప్రస్తుతం 1795 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 883759 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7186కు చేరింది. 
 
కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న తర్వాత కూడా పలు చోట్ల పలువురు కరోనా బారిన పడినట్లు వార్తలు రావడంతో చాలామంది వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై వైద్యనిపుణులు స్పందిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందేనని చెప్తున్నారు. 
 
టీకా పొందిన తర్వాత కూడా కరోనా వైరస్‌ బారిన పడటం సర్వసాధారణమే అని పలువురు నిపుణులు పేర్కొంటూ, కరోనా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నాక శరీరంలో దాని ప్రభావం చూపేందుకు పది నుంచి 14 రోజుల సమయం పడుతుందని అన్నారు. అప్పుడు కూడా కేవలం 50 శాతానికి పైగా మాత్రమే రోగనిరోధకత వస్తుంది. రెండో డోసు తీసుకున్న తర్వాతే పూర్తి రోగనిరోధకత వస్తుందని స్పష్టంగా వారు పేర్కొంటున్నారు. 
 
వ్యాక్సిన్‌ అనేది పూర్తిగా వైరస్‌ శరీరాన్ని ప్రభావితం చేయకుండా బలహీనం మాత్రమే చేస్తుందని.. వైరస్‌ పూర్తిగా రాకుండా కాదని వారు వివరించారు. ఇప్పటివరకు ఆమోదించబడిన అన్నివ్యాక్సిన్లు వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేసే వ్యాక్సిన్లు కావన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మనిషికి వైరస్‌ సోకినా అంత హానికరం కాదని వివరిస్తున్నారు.