మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (20:59 IST)

కరోనరీ యాంజియోగ్రామ్‌కి రూ. 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ప్రజల విజ్ఞప్తులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించి అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఆరోగ్య సమస్యలతో రోగులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సమస్యలు విన్నవించుకోడానికి పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ప్రజాదర్బార్‌లో ఉదయం ను

ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ప్రజల విజ్ఞప్తులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించి అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఆరోగ్య సమస్యలతో రోగులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సమస్యలు విన్నవించుకోడానికి పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ప్రజాదర్బార్‌లో ఉదయం నుంచి పలు సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తలమునకలై ఉన్నారు. అయినప్పటికీ ప్రజాదర్బార్‌కు తరలి వచ్చిన ప్రజలు, వికలాంగులు, వృద్ధుల వివిధ రకాల సమస్యలను సావధానంగా విని పరిష్కారాలను సూచించారు. 
 
విజయనగరం జిల్లా గరివిడి అర్బన్‌కు చెందిన బగ్గం బాల నాగేశ్వరరావు కరోనరీ యాంజియోగ్రామ్ చికిత్సకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స సమయంలో కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలని చెప్పగా, అందుకు అయ్యే ఖర్చును భరించలేక సతమతమయ్యాడు. ఈ స్థితిలో ప్రజాదర్బార్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నాగేశ్వరరావు తన ఆరోగ్య, ఆర్థిక స్థితిని వివరించి చికిత్స చేయించి ఆదుకోవాలని ఆవేదనను వెలిబుచ్చాడు. నాగేశ్వరరావు దుస్థితి విని స్పందించి తక్షణం రూ. 5 లక్షల ఆర్థిక సాయ అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 
 
భర్త చనిపోగా కుమారుడు ఆస్తి తీసుకుని కూడా పోషించడంలో నిర్లక్ష్యానికి గురైన వృద్ధురాలికి తగిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయం ఇచ్చారు. కూతురు వద్ద తలదాచుకుంటున్న ఆమెకు ఆసరాగా ఉండాలని కొంత నగదు సాయం ప్రకటించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరూరు గ్రామానికి చెందిన బట్టంశెట్టి లక్ష్మీదేవమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. 2010లో ఆమె భర్త చనిపోయారు. కుమారుడు వెంకటేశ్వర్లు రెండు సంవత్సరాలు పోషించినా తదుపరి నిర్లక్ష్యం చేయడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంది. తన పేరుపై ఉన్న ఇంటిని, పొలాన్ని కూడా కుమారుడు దౌర్జన్యంగా తీసుకోవడంతో ఆ వృద్ధురాలు అనాధగా మారింది. 
 
లక్ష్మీ దేవమ్మ ఇబ్బందిని చూసి జాలిపడి ఆమె కూతురు తల్లిని తనవద్ద ఉంచుకుని పోషిస్తోంది. ఆమె ఆవేదన విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించమని అధికారులను ఆదేశించారు. కుమారుడు ఆస్తి తీసుకుని నిర్లక్ష్యం చేయడంపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వృద్ధురాలికి తగిన న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హామీ ఇవ్వడంతో గుండె ధైర్యంతో లక్ష్మీ దేవమ్మ ఇంటిముఖం పట్టింది.