బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (22:37 IST)

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

Pawan kalyan
తాను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదా క్లాస్‌రూమ్‌లో కానీ లేదని అందుకే తాను ఇంటర్‌తోనే చదువును ఆపేశానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలో 35వ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. 
 
పుస్తకాలు ఉంటే ఇక ఉపాధ్యాయులు అవసరం కూడా ఉండదనిపిస్తుందన్నారు. ఇంటర్‌తోనే చదువు ఆపేశానని, కానీ పుస్తకాలను చదవడం మాత్రం ఆపలేదన్నారు. తాను చదువుకోలేకనో.. లేక మార్కులు తెచ్చుకోలేకనో చదువు ఆపలేదన్నారు. బాగా చదివేవాడినని, కానీ తాను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా స్కూల్‌కు వెళ్లకుండానే ఇంటివద్ద నేర్చుకున్నారని పుస్తకాల్లో చదివినట్టు చెప్పారు. ఆయన ప్రేరణతో అదే బాటలో ముందుకు సాగానని చెప్పారు. 
 
తనకు తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందన్నారు. తాను ఎక్కడైనా కోటి రూపాయలను ఇచ్చేందుకు ఏమాత్రం ఆలోచించనని, కానీ, పుస్తకం ఇవ్వాలంటే మాత్రం ఆలోచన చేస్తానని చెప్పారు. ఎవరికైనా నా పుస్తకం ఇవ్వాలంటే సంపద మొత్తం ఇచ్చినట్టుగా ఉంటుందన్నారు. ఎవరైనా పుస్తకాలు అడిగితే కొనిస్తాను తప్ప, తన వద్ద ఉన్న పుస్తకాలను మాత్రం ఇవ్వనని తెలిపారు. తనకు పుస్తక పఠనం అలవాటే లేకుంటే ఏమయ్యేవాడినో తనకే తెలియదన్నారు.
 
జీవితంలో తనకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకం.. పుస్తకాలను తన సంపదగా భావిస్తానని, తన వద్ద ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తాను.. నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయే వాడినో.. రెండు చోట్లా ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నిలబడేలా చేశాయి.. చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా అని చెప్పారు. సినిమాల్లో కోట్లాది రూపాయలను సంపాదించాను, అదేసమయంలో రూ.కోట్లు వదిలేసుకున్నాను, కానీ ఎప్పుడూ బాధ పడలేదన్నారు. అయితే, పుస్తకాలు ఒక అంగరక్షకుడిలా తనను కాపాడతాయని చెప్పారు.