ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (09:38 IST)

నా ఇంట్లో ఆడ బిడ్డలతో సహా మంత్రి అనిత కూడా బాధితురాలే... అందుకే అలా స్పందించా.. పవన్

pawan kalyan
తన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలతో పాటు సాక్షాత్ ఒక రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న అనిత కూడా బాధితురాలేనని, అందుకే తాను అంత ఆవేశంగా స్పందించాల్సి వచ్చిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పైగా, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండిచడమే కాకుండా, పోలీసులకు సైతం హెచ్చరికలు పంపారు. ఈ మేరకు బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలతో పాటు సోషల్ మీడియాలో వైకాపా క్యాడర్ పెడుతున్న అసభ్యకర పోస్టులపై సుధీర్ఘంగా చర్చించారు. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వారు చూసి కన్నీరు పెట్టడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానని ఆయన తెలిపారు. లోకేశ్ కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని ఘటనల్లో మహిళలు, బాలికలపై అత్యాచారం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారమైనా పోలీసులు సత్వరం స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడంపై మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, తన మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిద్దామన్నారు. సరిగ్గా ఒక్క నెలలో మొత్తం పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని ఆయన మంత్రివర్గానికి హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల అంశాన్ని మొదట ముఖ్యమంత్రే ప్రస్తావించారు. 
 
మంత్రివర్గ సమావేశానికి పవన్ రావడం ఐదారు నిమిషాలు ఆలస్యమవడంతో.. ఆలోగా మిగతా అంశాలు మాట్లాడదామంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపావారు చెలరేగిపోతున్న తీరును సీఎం ప్రస్తావించారు. 'నాతో సహా, క్రియాశీల నాయకులు, కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. నీచంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత కూడా బాధితురాలే. ఫేక్ పోస్టుల వ్యవహారం న్యూసెన్స్‌గా మారింది. గతంలో లేని విషసంస్కృతి వ్యాపించింది. దొంగ ఐపీలతో పోస్టులు పెట్టి తప్పించుకుంటున్నారు' అని ఆయన మండిపడ్డారు.