సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:12 IST)

మిస్సింగ్ కేసులో ఏపీ డీజీపీని కోర్టుకు రమ్మన్న హైకోర్టు

విశాఖపట్టణంలో ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు బుధవారం స్పందించింది. రెండ్రోజుల గడువుతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 
 
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది. 
 
జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయవిచారణ పూర్తి చేసి నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు. 
 
విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని, సంబంధిత వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.