మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (12:27 IST)

రివర్స్ పిఆర్సి జీవోలను రద్దు చేయాలి... బెజ‌వాడ‌లో భారీ ర్యాలీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రివర్స్ పిఆర్సి జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, విజయవాడ లో ఉద్యోగ సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఉద్యోగులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో తాము అంతర్భాగమ‌నే విషయాన్ని గుర్తు ఎరగాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
 
అశుతోష్ మిశ్రా నివేదికను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ, ఉద్యోగ సంఘాలు ఈరోజు నిరసన ర్యాలీ పిలుపునిచ్చాయి. వచ్చే నెల ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగుతున్న నేపథ్యంలో ఐక్య కార్యాచరణ సమితి మంగళవారం విజయవాడలో నిరసన ర్యాలీ చేపట్టింది. పాత బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు.
 
 
పాత పీఆర్సీని అమలు చేయాలని వారంతా డిమాండు చేస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల జీతాలు తగ్గించడం ఏమిటంటూ వారు ప్రశ్నించారు. పనికి తగ్గ వేతనాన్ని మాత్రమే తాము తీసుకుంటున్నామని, సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఉద్యోగులను కించపరిచే రీతిలో ప్రచారం చేయడం బాధాకరమని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే ముందు ఉన్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు ఎరగాలని, చీకటి జీవోలను రద్దు చేసి పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.