శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (13:56 IST)

నిరసనలు కొనసాగుతున్నా.. జోరుగా విశాఖ ఉక్కు విక్రయ ప్రక్రియ!

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం రాష్ట్రస్థాయి బంద్‌ను కూడా పాటిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు రోడ్డెక్కారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. 
 
అయితే కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా విక్రయ ప్రక్రియలో అడుగులు ముందుకేస్తున్నారు. పరిశ్రమకు నగరం నడిబొడ్డులో ఉన్న మద్దిలపాలెంతో పాటు అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన సీతమ్మధార ప్రాంతానికి చేరువలో ఉన్న 22.19 ఎకరాల భూమి అప్పగింతకు రంగం సిద్ధం చేశారు.
 
వీటితో సంబంధం లేకుండా పరిశ్రమ విక్రయానికి అధికారులు అడుగులు వేస్తున్నారు. దశాబ్దాల కిందట కర్మాగార ఉద్యోగుల కోసం చేపట్టిన 830 క్వార్టర్లు శిథిలమయ్యాయి. 130 క్వార్టర్లకు మరమ్మతులు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ భూమిలో వ్యాపార, నివాస సముదాయాలను నిర్మించి విక్రయించాలని నిర్ణయించారు. 
 
ఈ మేరకు అవసరమైన పనులు చేయడానికి జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్‌తో గత నెల 26న విశాఖ ఉక్కు పరిశ్రమ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. భూమిని నేరుగా విక్రయించడం కన్నా.. భవన నిర్మాణాలన్నీ పూర్తి చేసి విక్రయిస్తే మరింత లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు. 
 
ఈ భూమిని అత్యంత లాభదాయకంగా మార్చుకోవాలంటే భారీగా పెట్టుబడి పెట్టాలి. కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్​ఐఎన్ఎల్ నిర్ణయం ఎవరికి అనుకూలిస్తుందన్నది చర్చనీయాంశమవుతోంది.