బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (11:49 IST)

కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో.. విజయసాయి వార్నింగ్

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ సాగుతోంది. ఈ బంద్‌కు అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
అలాగే, బీజేపీ మినహా కార్మిక సంఘాలు, పార్టీలు, ప్రజలు దీనిలో బంద్‌లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో బంద్‌లో పాల్గొన్న వైపీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి చుక్కెదురు అయ్యింది. మానవహారాన్ని నిర్మించుకుంటూ... ప్రజలతో మాట్లాడుతూ వెళుతున్న ఆయనకు ఓ కార్మికసంఘానికి చెందిన నాయకుడి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.  
 
పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేసుకున్న ఒప్పందం అంటూ ఆ వ్యక్తి మరోసారి జవాబిచ్చాడు. 
 
అధికారులకు కూడా తెలియకుండా జరిగిపోయిందా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటకు విజయసాయి మండిపడ్డారు. 'కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో..  నీకు లేని అధికారాన్ని ప్రదర్శించలేవు' అంటూ గబగబా నడిచి వెళ్లిపోయాడు.