శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:25 IST)

విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కు గుండెకాయ : ఎంపీ మోపిదేవి వెంకటరమణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గుండెకాయ లాంటిదని, అలాంటి ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తామని వైకాపా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. 
 
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు. కానీ, ఇపుడు దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందుకు మొగ్గు చూపుతోంది. దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్ష కోసం మొదలైన ఉద్యమం ఊపందుకుంటోంది. 
 
అనేక రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నాయి. ఇపుడు ఢిల్లీపై పోరుకు సిద్ధమవుతోంది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి వీల్లేదని అంటోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలంతా ఏకమై కేంద్రంపై పోరాడాలని పిలుపునిస్తున్నారు నేతలు. 
 
వైజాగ్‌ స్టీల్స్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు రోడ్డెక్కారు.. రోజుకో తరహాలో దీక్షలకు దిగుతున్నారు. ఉక్కు ఉద్యమంలో భాగంగా కూర్మనపాలెంలో రిలే దీక్షలకు దిగారు కార్మికులు.
 
ఈ నేపథ్యంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ఆంధ్రప్రదేశ్‌కి గుండెకాయ లాంటిదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నారు. స్టీల్ ప్లాంట్‌ని కాపాడి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడుదామన్నారు. 
 
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్నారు. పార్లమెంట్‌లో కూడా ఎంపీలు అంత బలంగా పోరాటం చేస్తామని, వైసీపీ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.