కులాల వారీగా బీసీ జనగణనపై శాసనసభ తీర్మానం
ఆంధ్రప్రదేశ్ లో బీసీ జన గణన జరిగి, 90 సంవత్సరాలు గడిచిపోయిందని, అందుకే తాజాగా బీసీల జనగణన చేయాలని తీర్మానం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. బీసీల జనాభా దేశంలోనే దాదాపుగా 52 శాతం ఉంటుందని అంచనా. అయితే ఏనాడు కూడా వీరి సంఖ్య ఎంత అనేది జనాభా లెక్కల్లో మదింపు అనేది జరగలేదు.
1931లో బ్రిటీష్ వారి పాలనలో మాత్రమే కులపరమైన జనభా గణన జరిగింది. కులపరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికి 90 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు బీసీల జనాభా ఎంతనేది కేవలం అందాజాగానూ, సుమారుగా అన్న బాపతులోనే లెక్కవేస్తున్నారు తప్ప, కచ్చితమైన డేటా అన్నది ఎక్కడా లేదని సీఎం వివరించారు.
విద్యాపరంగా, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబాటు ఎంత ఉన్నది అన్నది కచ్చితంగా ఇంత ఉన్నది అన్నది లెక్క తెలిస్తే, ఏ మేరకు చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ప్రభుత్వాలకు మరింత స్పష్టత ఉంటుందని సీఎం చెప్పారు. 1951 నుంచి ఇప్పటివరకు బీసీల జనాభా లెక్కలు ఇంతవరకు సేకరించలేదని, ఇక సెన్సెస్‌లో కులపరంగా బీసీల వివరాలు కూడా చేర్చడం ఎందుకు అవసరం అన్నది మరింత విస్తారంగా కూడా ఆలోచన చేయాలన్నారు.
నిజానికి జనాభా లెక్కలు 2020లో జరగాలని, వివిధ కారణాలు వల్ల ప్రత్యేకించి కోవిడ్ వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయని, ఇప్పుడు ఆలస్యంగానైనా మొదలు కాబోతున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.