శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:41 IST)

గోవుల మృతిలో కుట్ర ఉంది: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం విజయవాడలోని తాడేపల్లి గోశాలను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవుల మృతిలో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నిష్పాక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం రాత్రి దాణా తిన్న 128 ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. అందులో 86 ఆవులు చనిపోయాయి. కాగా గోశాలలో 1500 ఆవులు ఉంటున్నాయి. 
 
విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలో కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నారు. ఈ ఆవరణ సరిపోకపోవడంతో కొత్తూరు తాడేపల్లిలో ఏడు ఎకరాల స్థలంలో మరో గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ పది షెడ్లు, మూడు బ్యారక్‌ల్లో సుమారు 1500 ఆవులు ఉన్నాయి. కమిటీ సభ్యులు కొన్నాళ్ల కిందటి వరకు విజయవాడలో దాణాను కొనుగోలు చేసేవారు. 
 
ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి దాణా (ముక్కలుగా నరికిన పచ్చిగడ్డి) తెప్పించుకుంటున్నారు. శుక్రవారం అద్దంకి నుంచి 7,425 కిలోలు... విజయవాడ చుట్టుపక్కల నుంచి నాలుగు విడతలుగా 5,610 కిలోల పచ్చిమేత వచ్చింది. కార్మికులు శుక్రవారం రాత్రి దీనిని గోవులకు ఆహారంగా వేశారు. రాత్రి 9.30 గంటల నుంచి ఆవులు నిలబడిన చోటే పడిపోసాగాయి. నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చాయి. రాత్రి 10 గంటల సమయానికి ఒక ఆవు చనిపోయింది. 
 
అప్పటి నుంచి ఒక్కో గంట గడిచేకొద్దీ మృత్యుఘోష మరింత పెరిగింది. కమిటీ సభ్యులు అప్పటికప్పుడు పశు సంవర్ధక శాఖ వైద్యులకు సమాచారం ఇచ్చారు. గోశాలలో సుమారు 1500 ఆవులు ఉండగా... 128 ఆవులు మాత్రం అస్వస్థతకు గురయ్యాయి. దీనిపై విచారణ జరుగుతోంది.