సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (15:28 IST)

సక్రమంగా స్కూలుకు పంపితేనే అమ్మ ఒడి పథకం : మంత్రి బొత్స

botsa
తమ పిల్లలను సక్రమంగా స్కూలుకు పంపితేనే అమ్మ ఒడి పథకాన్ని అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ  నెల 27వ తేదీన అమ్మ ఒడి పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అయితే, ఈ పథకం కింద ఇచ్చే నిధుల్లో రూ.2 వేల మేరకు తగ్గించారు. అంటే యేడాదికి రూ.15 వేలు ఇవ్వాల్సివుండగా రూ.13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పైగా, లబ్దిపొందే విద్యార్థుల సంఖ్య లక్షకు పైగా తగ్గించేశారు. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుందన్నారు. 
 
విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కలెక్షన్‌ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని బొత్స చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. 
 
ఇంటర్‌లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామని.. ఈ పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామన్నారు.