శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (09:57 IST)

అమరావతి రైల్వే లైనుకు అక్షరాలా వెయ్యి రూపాయలు కేటాయింపు!!!

amaravati railway line
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదేళ్ళుగా చిన్నచూపు చూస్తుందని పలు సందర్భాల్లో తేలింది. తాజాగా గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ మరోమారు తన పక్షపాతాన్ని బహిర్గతం చేసింది. ఏపీ రాజధాని అమరావతి మధ్య ఉండే విజయవాడ - గుంటూరు నగరాలను కలిపేందుకు ప్రతిపాదించిన రైల్వే లైను నిర్మాణానికి కేవలం అక్షరాలా వెయ్యి అంటే వెయ్యి రూపాయలు కేటాయించింది. 
 
మొత్తం రూ.2,679 కోట్ల వ్యయమయ్యే ఈ లైనుకు గత ఐదేళ్ళలో రూ.2.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అదికూడా సర్వేల కోసం వెచ్చించిందే. ఇపుడు రూ.1000 ఇస్తామని పేర్కొనడం చూస్తే కేంద్రం మన రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో గతంలో మంజూరైన వివిధ లైన్లకు కూడా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షలు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్ కార్యాలయాలు తదితరాలకు కలిపి రూ.170 కోట్లు వ్యయం అవుతుందని గతంలో అంచనా వేయగా, దీనికి ఇప్పుడు ఇస్తామంటున్నది కేవలం రూ.9 కోట్లు మాత్రమే. 
 
ఇది రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొన్న నిధుల తీరు. కొన్నింటికి మొక్కుబడిగా ఇవ్వగా.. అత్యధిక ప్రాజెక్టులకు మొండిచేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు సాధించడంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం, వైకాపా ఎంపీలు మరోమారు పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, అందులో రైల్వే శాఖకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. వాటిలో రాష్ట్రానికి చెందిన కీలక ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మొత్తంగా రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పుకోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజను కలిపి రూ.9.138 కోట్లు కేటాయించారు. 
 
ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎంత ఒత్తిడి తీసుకొస్తేనే అంత పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు ఉంటుంది. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వం మరోసారి విఫలమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 31 మంది వైకాపా ఎంపీలున్నా.. రాష్ట్రానికి పెద్దఎత్తున రైల్వే నిధులను రాబట్టలేకపోయారు. విశాఖలో జోన్ కార్యాలయానికి సిద్ధంగా ఉన్నామని రైల్వేశాఖ చెబుతుంటే.. దానికి భూమిని అప్పగించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి జరగకూడదన్న మొండిపట్టుదలతో వైకాపా ప్రభుత్వం ఉందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.