సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:40 IST)

విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ సిద్ధం... ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదు : మంత్రి అశ్వినీ

ashwini vaishnav
విభజన హామీల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్‌ను విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారైందని కానీ, రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మాత్రం ఏపీ ప్రభుత్వం కేటాయించడం లేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 
 
లోక్‌సభలో గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేవలం 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని కానీ, ఇప్పటివరకు అప్పగించలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు. భూమి అస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.886 కోట్ల నిధులు ఇవ్వగా ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క ఏపీకే రూ.9138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో యేడాదికి 240 కిలోమీటర్ల మేరకు కొత్త ట్రాక్ నిర్మాణం సాగుతుందన్నారు. 98 శాతం విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని వివరించారు. అలాగే, ఈ బడ్జెట్‌లో తెలంగాణాకు రూ.5071 కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు.