ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (04:45 IST)

వైఎస్ జగన్‌ నాకు ఒక్క లేఖా రాయలేదు, ఒక్కసారీ కలవలేదు: ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి రమాకాంత్ రెడ్డి

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ పెట్టిన కేసు్ల్లో ఏ ఒక్కటీ నెగ్గదని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ పి.రమాకాంత్‌రెడ్డి కుండ బద్దలుకొట్టారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ పెట్టిన కేసు్ల్లో ఏ ఒక్కటీ నెగ్గదని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ పి.రమాకాంత్‌రెడ్డి కుండ బద్దలుకొట్టారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసిన సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) వి.వి.లక్ష్మీనారాయణకు రాష్ట్ర సెక్రటేరియెట్, కేబినెట్‌ నిబంధనలు తెలియవని అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ పి.రమాకాంత్‌రెడ్డి చెప్పారు. జగన్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ సీబీఐ ఆరేళ్ల క్రితం నమోదు చేసిన కేసుల దర్యాప్తునకు సంబంధించి ఒక ప్రముఖ తెలుగు మీడియా చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాకాంత్‌రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై అసలు అవగాహన లేదని జగన్‌ కేసు విచారణ జరిగిన తీరు చూస్తే తనకు అర్థమైందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. 
 
పైగా తాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు సచివాలయంలో గాని, అసెంబ్లీలో గాని, ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలోగాని జరిగిన ఏ ఒక్క సమావేశానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాలేదని తనకు ఇది కావాలని, ఫలానా కంపెనీకి అది కావాలని జగన్ ఎన్నడూ నాకు లేఖరాయలేదని, ఒక్కరోజు కూడా ఆయన నాకు ఫోన్ చేయలేదని రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత సానుభూతిని తెలుపడానికి వెళ్లి కలిశానే తప్ప 2009 సెప్టెంబర్‌కు ముందు జగన్‌ని తానెన్నడూ కలవలేదని రమకాంత్ రెడ్డి చెప్పారు. నాటి పరిణామల గురించి ఆయన మాటల్లోనే చూద్దాం. 
 
‘‘నేను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు సచివాలయంలో గాని, అసెంబ్లీలో గాని, ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలోగాని జరిగిన ఏ ఒక్క సమావేశానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాలేదు. ఈ విషయం కచ్చితంగా చెప్పగలను. ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఎంపీగా ఫలానా వాళ్లకు అది ఇవ్వండి అని గాని, ఇవ్వొద్దు అని గాని, నాకు ఇది కావాలని గాని, ఫలానా కంపెనీకి అది కావాలని గాని ఆయన నాకు ఎప్పుడూ ఎలాంటి లేఖ రాయలేదు. ఒక్కరోజు కూడా ఆయన నాకు ఫోన్‌ చేయలేదు. నేను జగన్‌ను ఎప్పుడు కలిశానంటే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నా సానుభూతి తెలియజేయడానికి వెళ్లి కలిశాను. అంతకు ముందెప్పుడూ కలవడం జరగలేదు."
 
అనుమతులిచ్చిన అథారిటీని ఎలా పిలుస్తారు
మీరు విచారణకు ఎవరిని పిలుస్తారు.. అని లక్ష్మీ నారాయణను అడిగాను. అనుమతులు ఇచ్చింది ఎవరు? కేబినెట్‌. దానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. పిలవడానికి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు. కాబట్టి కేబినెట్‌లోని మంత్రులందరినీ పిలిచి అడుగుతారా? రూల్‌ ఏమిటంటే.. కేబినెట్‌లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము(కార్యదర్శులం) కారణాలు రాయనక్కరలేదు. కేబినెట్‌ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది కూడా రాయనక్కరలేదు. మీకు ఆశ్చర్యం అనిపించ వచ్చు గానీ.. అది మా రూల్‌లో ఉంది. కేబినెట్‌లో ఫలానా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో రికార్డు చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగు తారు అని జేడీతో అన్నాను. అప్పుడు పనిచేసిన మంత్రులను పిలిచి అడిగితే వాళ్లేమంటారు... అది సమిష్టి బాధ్యత అని చెబుతారు. మరి ఎవరిని అడుగుతారు అనుమతులు ఇచ్చిన అథారిటీని అడగాలి. ఆ అథారిటీని ఎలా పిలుస్తారు? కాబట్టి మీ విచారణపై నాకు పెద్దగా నమ్మకం లేదు అని జేడీ సమక్షంలోనే చెప్పేశాను అని రమాకాంత్ రెడ్డి తెలిపారు. 
 
కేబినెట్‌ నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌ గురించి ప్రశ్నించడానికి లక్ష్మీనారాయణ నన్ను దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లోని తన ఏసీ గదిలో కూర్చోబెట్టారు. 48 ఫైళ్లు నా ముందుంచారు. ‘మీరు సంతకం చేశారు, ఇలా నోట్‌ వచ్చినప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. రాష్ట్రంలో సెక్రటేరియెట్‌ రూల్స్, పద్ధతులు సీబీఐ వాళ్లకు తెలియవు. బేసిక్‌గా అది ఒక ప్రాబ్లమ్‌. కేబినెట్‌ సమావేశం అంటే ఏమిటి ఏ పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారు.. ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం.. కేబినెట్‌ పరిధి ఏమిటి.. ముఖ్యమంత్రికి గల అధికారాలేమిటి కేబినెట్‌లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు సీబీఐకి నిజంగా తెలియదు. వాళ్లకు (సీబీఐ) భారత ప్రభుత్వ రూల్సే తెలుసు కాని రాష్ట్ర ప్రభుత్వ రూల్స్‌ తెలియవు. అసెంబ్లీ నిబంధనలు తెలియవు. స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలేమిటో తెలియవు. మాలాంటి కార్యదర్శులకు ఉన్న అధికారులు, విధులు, బాధ్యతలు ఏమిటో వారికి తెలియవు. నాకు బేసిక్‌గా తెలిసింది ఏమిటంటే.. అసలు స్టేట్‌ గవర్నమెంట్‌ రూల్స్, ప్రొసీజర్స్‌ను కూడా అర్థం చేసుకోకుండా సీబీఐ వాళ్లు విచారణ మొదలుపెట్టారు. నేను ఆరోజే ఆయన (లక్ష్మీనారాయణ)ను ఈ కేసులు నిలుస్తాయని నిజంగా మీకు నమ్మకం ఉందా.. అని అడిగితే... సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వేశారాయన అని రమాకాంత్ రెడ్డి తెలిపారు. 
 
రమాకాంత్ రెడ్డి చెప్పిన మాటల సారాంశం ఇది. 
 
సీబీఐకి రాష్ట్ర సచివాలయం, కేబినెట్‌ రూల్స్‌ తెలియవు
మంత్రివర్గ సమావేశం ఎందుకు నిర్వహిస్తారో కూడా తెలియదు
కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయానికి కారణాలు రాయనక్కరలేదు
రూల్స్‌ తెలుసుకోకుండానే వైఎస్‌ జగన్‌ కేసుల్లో విచారణ ప్రారంభించారు
సచివాలయంలో, క్యాంప్‌ ఆఫీసులో జరిగిన సమావేశాలకు జగన్‌ రాలేదు
ఫలానా పని చేసి పెట్టాలంటూ నాకు ఎన్నడూ లేఖ రాయలేదు
వైఎస్‌ చనిపోయిన తర్వాతే జగన్‌ను కలిశా