శుక్రవారం, 7 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 9 జులై 2014 (16:13 IST)

అగస్టా వెస్ట్‌ల్యాండ్ కథేంటి.. నరసింహన్‌కు లింకేంటి?

యూపీఏ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదుపిన స్కామ్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందం. ఈ స్కామ్‌లో చిక్కుకుని ఇప్పటికే ఇద్దరు గవర్నర్లు తమ పదవులను త్యజించారు. ఇపుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చిక్కేలా ఉన్నారు. ఈయన వద్ద బుధవారం సీబీఐ అధికారులు రెండు గంటల పాటు విచారించి, సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని సేకరించారు. అలాంటి స్కామ్ కథేంటి... దీనికి నరసింహన్‌కు ఉన్న లింకేంటి అనే అంశాన్ని పరిశీలిస్తే.. 
 
వీవీఐపీల ప్రయాణ అవసరాల కోసం అత్యుత్తమ ప్రమాణాలున్న 12 హెలికాఫ్టర్లను కొనుగోలు చేయాలని గత యూపీఏ హయాంలో నిర్ణయించారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ బిడ్‌కు అర్హత సాధించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్... అనూహ్యంగా ఈ డీల్‌ను ఎగురేసుకుపోయింది. ముందుగా నిర్దేశించిన సాంకేతిక  ప్రమాణాల ప్రకారం... టెండర్‌లో పాల్గొనే అర్హత ఈ సంస్థకు లేదు. అయితే, హెలికాఫ్టర్‌ ఎగరగలిగే గరిష్ట ఎత్తును తగ్గించడంతో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కూడా అర్హత సాధించింది. 
 
2005 మార్చి 1వ తేదీన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌, ఎస్‌పీజీ చీఫ్‌ బీవీ వాంఛూ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌గా ఉన్న నరసింహన్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ డీల్‌... ఆంగ్లో-ఇటాలియన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు కట్టబెట్టారు. రూ.3600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 3600 కోట్లలో 10 శాతం.. అంటే 360 కోట్లు ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. 
 
తొలుత ఈ గుట్టును ఇటలీ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. దీంతో... సీబీఐ కూడా రంగంలోకి దిగక తప్పలేదు. లోగుట్టు బయటపెట్టేందుకు సీబీఐ ఇప్పటికే అనేకమందిని ప్రశ్నించింది. అప్పటి వైమానిక దళాధిపతి త్యాగి, ఆయన సమీప బంధువు, బ్రిటన్‌కు చెందిన ఓ మధ్యవర్తిసహా 13 మందిపై కేసు నమోదు చేసింది. 
 
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కమిటీలో నారాయణన్‌, వాంఛూ, నరసింహన్‌లతో పాటు సుమారు 15మంది సభ్యులున్నారు. యాదృచ్ఛికంగానో, మరే ఇతర కారణాల వల్లో... నారాయణన్‌, వాంఛూ, నరసింహన్‌లను యూపీఏ సర్కారు గవర్నర్లుగా నియమించింది. రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి అయిన గవర్నర్‌ను సీబీఐ సాక్షిగా ప్రశ్నించింది. ఒకసారి సీబీఐ ప్రశ్నించిన తర్వాత రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో కొనసాగడం సమంజసం కాదనే ఉద్దేశంతోనే నారాయణన్‌, వాంఛూ తమ పదవులకు రాజీనామా చేశారు. 
 
మరోవైపు... యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లందరూ తప్పుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. నరసింహన్‌ కూడా ఆ కోవలోకే వస్తారు. తాజాగా సీబీఐ విచారణ తోడవడంతో ఆయన పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. నరసింహన్‌ వ్యవహార శైలిపై అటు ఎన్డీయే  ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నరసింహన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.