సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (22:50 IST)

రాజమండ్రి జైలుకు చంద్రబాబు... ప్రత్యేక గది కేటాయించాలని కోర్టు ఆదేశం

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందని పేర్కొంటూ సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే ఆయన ఈ నెల 22వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు, రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గదిని కేటాయించాలని ఆదేశించింది. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేసింది. అలాగే, ఆయనకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స కూడా అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని రాజమండ్రి జైలు అధికారులకు నిర్దేశం చేసింది. 
 
కాగా, చంద్రబాబును రాజమండ్రి జైలుకు ఆయన సొంత కాన్వాయ్‌లోనే తరలిస్తున్నారు. ప్రస్తుంత విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రికి చేరుకునేందుకు కనీసం రెండు గంటలకు పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా వెళుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలావుంటే చంద్రబాబు అరెస్టుకు టీడీపీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఉత్తర్వులు వెళ్లాయి. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తున్నట్టు తీర్పు వెలువరించిన అనంతరం... ఇదే కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‍పై వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు, చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. వారం రోజుల కస్టడీకి కోరింది. ఈ పిటిషన్‌ను కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది.