శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (11:29 IST)

టీడీపీ నేతల గృహ నిర్బంధం - గవర్నర్ అపాయింట్‌మెంట్ రద్దు

cbn in hospital
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లా వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును గృహనిర్బంధం చేశారు. జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, ఆ పార్టీ కార్పొరేటర్ల నివాసాలను వద్ద పోలీసులు మోహరించారు. 
 
గుంటూరులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను గృహనిర్బంధం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తెదేపా నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మరోవైపు నెల్లూరు నగరంలో పలు రోడ్లను బారికేడ్లతో పోలీసుల దిగ్బంధించారు. మాగుంట లేఔట్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసం వద్దకు తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 
 
ఎవరూ రాకుండా చుట్టపక్కల రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. ఎమ్మెల్యే నివాసంలో రోజువారీ విధులు నిర్వహించే సిబ్బంది, పనివారిని కూడా బారికేడ్ల అవతలే పోలీసులు నిలిపివేశారు.
 
ఇదిలావుంటే, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించగా, ఆ మేరకు వారికి రాజ్‌భవన్ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. దీన్ని ఇపుడు రద్దు చేసింది. వాస్తవానికి టీడీపీ నేతలు నిన్ననే గవర్నర్‌ను కలవాలని భావించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ పర్యటనలో భాగంగా, విశాఖ పోర్ట్‌గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. 
 
శనివారం రాత్రి 7.30 గంటలకు ఆయనను కలవాలని అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితర నేతలు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో ఆదివారం ఉదయం 9.45 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యవహారంపై సీఐడీ కోర్టులో విచారణ జరుగుతున్నందున అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశారు.