బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:54 IST)

బెజవాడలో తెలుగు తమ్ముళ్ళ కీచులాట.. చంద్రబాబు వార్నింగ్

బెజవాడకు చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా, విజయవాడ ఎంపీ కేశినేని నాన, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పార్టీ గురించి మాట్లాడినా, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటే పార్టీకి ఇబ్బందులు వస్తాయని, అందువల్ల కిమ్మనకుండా ఉండాలని కోరారు. 
 
అసలు వీరిద్దరి మధ్య విభేదాల రావడానికి గల కారణాలను పరిశీలిస్తే, 39వ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గుండారపు పూజితను కాదని... వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి కేశినేని నాని టికెట్ ఇవ్వడంతో వివాదం రాజుకుంది. 
 
నాని నిర్ణయంపై బుద్ధా వెంకన్న వర్గీయులు మండిపడ్డారు. కేశినేని నానిని గుండారపు హరిబాబు, ఆయన కుమార్తె పూజితలు అడ్డుకుని నిలదీశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న తమను కాదని, ఇతరులకు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బీసీలమైన తమకు అన్యాయం చేయడం సబబు కాదని మండిపడ్డారు.
 
గత కొంత కాలంగా కేశినేని నానికి, ఇతర స్థానిక నేతలైన బోండా ఉమ, బుద్ధా  వెంకన్న, నాగుల్ మీరా తదితరులకు దూరం పెరుగుతూ వస్తోంది. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరకు చంద్రబాబు రంగంలోకి దిగారు. 39వ డివిజన్ అభ్యర్థి అంశాన్ని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.