శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (14:05 IST)

పవన్ పోరాటంలో అర్థం ఉంది.. కాంగ్రెస్‌తో కలిస్తే లాభంలేదు : చంద్రబాబు

విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్ర హక్కుల సాధన కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వల్ల లాభమేంటని ఏపీ ముఖ్యమంత్రి నారా

విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్ర హక్కుల సాధన కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వల్ల లాభమేంటని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 
 
ఏపీ డిమాండ్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీపై చంద్రబాబు గురువారం స్పందించారు. 'పవన్ జేఎఫ్‌సీ ఏర్పాటు వల్ల మనకెలాంటి ఇబ్బంది లేదు. అలాగే, పవన్ పోరాటంలో అర్థముంది... రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ పోరాటం చేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
అయితే, ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్చుకోవడం ఏమాత్రం సబబుగా లేదన్నారు. ఎందుకంటే మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని, అలాంటి పార్టీకి జేఎఫ్‌సీలో చోటు కల్పించడం ఏమాత్రం ప్రయోజనకరంకాదన్నారు. 
 
ఇకపోతే, నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ విధించిన డెడ్‌లైన్‌పై కూడా చంద్రబాబు చర్చించారు. శ్వేతపత్రం ఇవ్వాల్సింది కేంద్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం కాదని సీఎం అభిప్రాయం వ్యక్తంచేశారు. శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.