శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (18:09 IST)

రాజధానికి అమరావతి పేరును రామోజీరావు సూచించారు : చంద్రబాబు

రాజధానికి అమరావతి పేరును రామోజీరావు సూచించారని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పేరు వెనుక ఉన్న చరిత్రను, వివరాలను తనకు పంపారని గుర్తు చేశారు. అందుకే అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా, ప్రపంచంలోని 10 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిర్మిస్తామన్నారు. 
 
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘ఆమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాతవాహనాల కాలంలోనే అమరావతి ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందిందని, అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతాన్ని తర్వాతి కాలంలో పరిపాలించిన వేంకటాద్రి నాయుడు గురించి పుస్తకం తీసుకురావటం అభినందనీయమన్నారు. 
 
గతంలో అమరావతి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలిసేది కాదని.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని గురించి చర్చ మొదలైందన్నారు. రాజధానిలో భవనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దేశీయ రూపశిల్పులతో ఆకృతులు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. 
 
ఈ ప్రాంతం నుంచే బుద్దిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని.. అందుకే అమరావతిలో అంతర్జాతీయ బుద్ధిజం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన వారసత్వ సంపద లండన్‌ మ్యూజియంతో పాటు చెన్నై, హైదరాబాద్‌లోని ప్రదర్శనశాలల్లో ఉందని.. దాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.