శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (06:50 IST)

ఓటమితో చంద్రబాబుకు మతి భ్రమించింది.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న అసత్య ఆరోపణలను పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖండించారు.

విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విధంగా చంద్రబాబు వ్యవహరించటం వల్ల ఇంకా భంగపాటు పడతారు తప్ప ఇంకొకటి సాధించేది ఏమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీ, ఇతర పార్టీలు అందరూ కలిసినా, వారికి కలిసినా 50% ఓట్లు రాలేదు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని ఒక్క వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే 50% దాటాయి అని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు.

ఇంత స్పష్టంగా ప్రజాతీర్పు ఉంటే.. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గురించి చంద్రబాబు విమర్శలు చేయటం సరికాదని ఉమ్మారెడ్డి హితవు పలికారు. గత ప్రభుత్వంలో పెట్టినవే సంక్షేమ కార్యక్రమాలని ఇప్పుడు పెడుతున్నవి కావని చంద్రబాబు విమర్శలు సరికావన్నారు. 
 
ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది ఎవరు? గ్రామాల వారీగా ఎక్సైజ్‌ శాఖకు టార్గెట్లు విధించింది బాబే
మద్యపాన నిషేధంపై శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టత ఇచ్చారు. విడత వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తారు.
మందుబాబుల రక్తాన్ని తాగుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఉమ్మారెడ్డి తప్పుబట్టారు. గతంలో మహిళలు ఉద్యమాలుచేస్తే ఎన్టీఆర్‌ మద్యపానాన్ని రాష్ట్రంలో నిషేధించారు.

మరి, ఎన్టీఆర్‌ నిషేధించిన మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేసింది ఎవరో చంద్రబాబు చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్‌శాఖకు గ్రామాల్లో టార్గెట్‌లు పెట్టింది ఎవరు? ఆనాడు రక్తం తాగటానికి అలవాటు పడింది చంద్రబాబే. ఆనాడు బాబు కళ్లు బైర్లు కమ్మాయి. మద్యం మీద వచ్చే ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.

అందువల్లే కళ్లు పొరలు కమ్మి ఉన్నాయి కాబట్టే.. ఆరోజు రక్తం తాగుతున్నారో.. నీళ్లు తాగుతున్నారో చంద్రబాబుకు అర్థం కాలేదని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.  కనీసం ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనూ చంద్రబాబు పెట్టలేదు. ఎన్టీఆర్‌ పెట్టిన మద్యపాన నిషేధాన్ని తీసేసి మళ్లీ దాని ఊసే మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టలేదు. కానీ జగన్‌ మేనిఫెస్టోలో పెట్టారు. పాదయాత్రలో మహిళల ఆక్రందనలు వైయస్‌ జగన్‌ వినలేకపోయారు.

కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి అని మద్యపాన నిషేధం అమలు చేస్తానని అదీనూ 4 విడతల్లో అమలు చేస్తానని వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారని ఉమ్మారెడ్డి తెలిపారు.

మొదటి విడతలో బెల్ట్‌ షాపులు తీసేయటం, రెండో విడతలో లిక్కర్‌ను ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మటం ద్వారా లేకపోతే రేట్లు పెంచి అందుబాటులో లేకుండా చేస్తానని, ఆఖరుకి వచ్చేసరికి ఫైవ్‌ స్టార్, సెవన్‌ స్టార్‌ హోటల్స్‌లో మాత్రమే మద్యాన్ని అందుబాటులో తెస్తామని గ్రామల్లో ఎక్కడా మందు దొరకకుండా చేస్తామని జగన్‌ స్పష్టంగా చెప్పారు. జగన్‌ చెప్పింది చేస్తున్నారు. జలగలు రక్తం పీల్చినట్లు మద్యంపై చంద్రబాబు చేశారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. 
 
బీజేపీ పాలిత రాష్ట్రం కూడా పీపీఏలను సమీక్షిస్తోంది. దానిపై స్పందించవెందుకు? గత ప్రభుత్వం విద్యుత్‌ ఒప్పందాలు ఎక్కువకు ఇచ్చిందని .. పీపీఏలు సమీక్షించి రేట్లు ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించటానికి వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్‌ కాదని చంద్రబాబు పీపీఏలపై సమీక్షలు వద్దంటున్నారు. పీపీఏలపై సమీక్షిస్తోంది ఒక్క ఏపీనే కాదని ఉమ్మారెడ్డి అన్నారు. టెక్నాలజీ పెరిగిన కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ తగ్గింది కాబట్టి రేట్లు రివ్యూ చేయాలని బీజేపీ పరిపాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రివ్యూ చేసి కేంద్రానికి పంపించారు.

ఉత్తరప్రదేశ్‌ పంపినదానిపై కేంద్రం మాట్లాడరు. ఏపీ ముఖ్యమంత్రి నుంచి ప్రపోజల్‌ వెళ్తే ఇది రివ్యూ చేయటం కరెక్ట్‌ కాదనటం ఏంటి? ఇది కరెక్టే అని మేము చెబుతున్నామని ఉమ్మారెడ్డి అన్నారు. ఎందుకు అంటే రాబోయే 25 ఏళ్లకు రూ.6.84పై యూనిట్‌ విద్యుత్‌కు చెల్లించాల్సి ఉంటుందని ఉమ్మారెడ్డి వివరించారు. చంద్రబాబును 5ఏళ్లు మాత్రమే పరిపాలించాలని ప్రజలు అధికారమిస్తే రాబోయే 25ఏళ్లకు ఇదే రేటు ప్రభుత్వం చెల్లిస్తుందని ఒప్పందం చేసుకున్నారు.

ఆ అధికారాన్ని చంద్రబాబుకు ఎవరిచ్చారు? అలాంటి వాటి మీద రివ్యూ చేస్తే తప్పా? ప్రభుత్వానికి ఆదాయం ఆదా చేసుకుంటే తప్పా? ప్రభుత్వం ఖర్చు ఎక్కువ కాకుండా ప్రజల సొమ్మును ఆదా చేస్తే తప్పా? ఈ విధంగా చంద్రబాబు మాట్లాడటం ఏంటని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు బీజేపీతో విభేధించి బయటకు రావటం వల్లనే ఓడిపోయానని చంద్రబాబు అంటున్నారు.

అదే చెంపలు వేసుకొని మీరు కేంద్రానికి ఎందుకు లేఖలు రాస్తున్నారని యూపీ రాష్ట్రాన్ని అడుగమని ఉమ్మారెడ్డి సూచించారు. యూపీ ప్రభుత్వాన్ని ఎలా సమర్థిస్తున్నావు చంద్రబాబూ అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. 
 
బాబులా కమీషన్లు లేకపోవటంతో తక్కువకే కోట్‌ చేశారు. చంద్రబాబు మాట్లాడేదాంట్లో ఒకదానికి ఇంకోదానికి పొంతనలేకుండా పోయిందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం నష్టపోతోందని చంద్రబాబు ఏవో ఉదాహరణలు చెబుతున్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.7,500 కోట్లు నష్టం జరుగుతోందని చంద్రబాబు భాష్యం చెప్పటంపై ఉమ్మారెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు నలభై సంవత్సరాల అనుభవం ఏమైపోయింది. నలభై ఏళ్ల అనుభవంలో చంద్రబాబు నేర్చుకున్న లెక్కలు ఇవా అని ఉమ్మారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రతి చిన్న అంశంతో సహా.. రూ.850 కోట్లు ఆదా అయిందని చెప్పారు. దాన్ని కాదని చంద్రబాబు నిరూపించగలవా? కాకిలెక్కలతో నోరు వేసుకొని మాట్లాడటం కాదని చంద్రబాబుకు ఉమ్మారెడ్డి హితవు పలికారు.

గతంలో పోలవరం టెండర్లలో మెగా కంపెనీ వాళ్లు ఎక్కువకు కోట్‌  చేశారని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువకు కోట్‌ చేయటం ఏంటని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుకు పర్సంటేజీ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఆనాడు ఎక్కువకు కోట్‌ చేశారు. కానీ, ఇప్పుడు పర్సంటేజీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టే తక్కువకు కోట్‌ చేయటం జరిగిందని ఉమ్మారెడ్డి తెలిపారు. దీనికి అంత ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదని ఇది సింపుల్‌ లాజిక్‌ అని ఉమ్మారెడ్డి వివరించారు. 
 
ఢిల్లీ పర్యటనలో రివర్స్‌ టెండరింగ్‌పై ప్రధానికి సవివరంగా సీఎం తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాంట్రాక్టర్లు కప్పం కట్టారు. గతంలో టెండర్ల పేరుతో అడ్వాన్స్‌లు ఇచ్చి వాటిలో చంద్రబాబు, లోకేశ్‌లు క్యాష్ వసూలు చేసుకున్న రోజులు ఉన్నాయి. దానికోసం కాంట్రాక్టర్లు కప్పం కట్టారు. ఈరోజు అటువంటి అవసరాలు లేవు కాబట్టి తక్కువకు కోట్‌ చేశారని ఉమ్మారెడ్డి వివరించారు.

పోలవరంలో రూ.840 కోట్లు ఆదా ఉందని ఈ వివరాలన్నీ జగన్‌ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీగారికి వివరించారు. ఈ రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇలా వస్తోందని.. మిగతా వాటిల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ..  పిచ్చోడి చేతిలో రాయిలా ఉందనే భాష వాడటం సరైనది కాదని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు వయస్సుకు తగిన భాష కాదని, ఆయన నిర్వహించిన పదవులకు తగినది కాదని, దీనికి నాలుగు రెట్లు ఎదురు సమాధానం చెప్పగలమని ఉమ్మారెడ్డి అన్నారు. అయితే, మాకు సంస్కారం అడ్డం వస్తోందన్నారు. చంద్రబాబు అన్నీ వదిలేశారు కాబట్టే ఏ భాషైనా మాట్లాడుతున్నారు. మాకు సంస్కారం అడ్డు వస్తోంది కాబట్టే చంద్రబాబును ఏమీ అనటం లేదన్నారు.

ఏ గ్రామం వెళ్లినా.. నాలుగు రోడ్ల కూడలిలో కూర్చున్నా చంద్రబాబుకు మతి భ్రమించిందా, ఒక్క ఓటమితో మతి చలించిందా అని ప్రజానీకం మాట్లాడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు భాష సరి చేసుకోవాలని ఉమ్మారెడ్డి అన్నారు. 
 
లోకేశ్‌ ఓటమితో చంద్రబాబుకు మతిభ్రమించింది. మంగళగిరిలో చంద్రబాబు కొడుకు లోకేశ్‌ డబ్బు కుమ్మరించి కూడా ఓడిపోయారు. మంగళగిరిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డబ్బు కుమ్మరించి అబద్దాలు చెప్పటం వల్ల ఓడిపోయారని చంద్రబాబు అనటం హాస్యాస్పదంగా ఉందని ఉమ్మారెడ్డి అన్నారు.

అంతకుముందు చంద్రబాబుకు కాస్తోకూస్తో జ్ఞాపకశక్తి ఉండేదని.. ఓటమితో చంద్రబాబుకు జ్ఞాపకశక్తి పోయిందన్నారు. చివరికి, ఇప్పుడు చంద్రబాబు మెమరీలాస్‌తో బాధపడుతున్నారు. కొడుకు ఓడిపోయారు అన్న బాధ నుంచి బయటపడలేక ఎదుటి వారి మీద బురద చల్లటం సరైన పద్ధతి కాదని, వాస్తవాలు చంద్రబాబు మాట్లాడాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు.  
 
పులివెందుల పంచాయతీ ఏంటి? సరిగ్గా మాట్లాడు చంద్రబాబు. రౌడీయిజం పేటెంట్ హక్కు చంద్రబాబుదే. 
రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందని చంద్రబాబు విమర్శలు చేయటంపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిలదీశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం చంద్రబాబు ఎక్కడ చూశారో.. నాకైతే తెలియటం లేదని ఉమ్మారెడ్డి అన్నారు.

రౌడీయిజం చేస్తే చంద్రబాబు చేశారు.. చేయించారు. రౌడీయిజం పేటెంట్‌ హక్కు చంద్రబాబుది. పులివెందుల పంచాయతీ అని ఈ మధ్య చంద్రబాబు ఊతపదం నేర్చుకున్నారు. మరి, పులివెందుల పంచాయతీల్లో అక్రమాలు, అన్యాయాలు జరిగాయా? చంద్రబాబు పంచాయతీల్లో జరిగాయని ఉమ్మారెడ్డి అన్నారు. 

దెందులూరు నియోజకవర్గంలో ఒక మహిళా ఎమ్మార్వోని ఓ ఎమ్మెల్యే జుట్టుపట్టుకొని వస్తే చంద్రబాబుకు కీచకపర్వం కనబడలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దృష్టిలో అది రౌడీరాజ్యం కాదా అని ఉమ్మారెడ్డి నిలదీశారు. ఆ సంఘటన జరిగిన రోజున కాకుండా తర్వాత రోజు దెబ్బతిన్న ఎమ్మార్వోని, అరాచకంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ముందే ఎందుకు ఆ ప్రాంతానికి పోయావమ్మా అని ఆమెనే చంద్రబాబు హెచ్చరించారు.

అంతేగాక దీనిపై ఎంక్వైరీ వేస్తానని అన్నారు. అప్పటికే చంద్రబాబు ఎమ్మార్వోదే తప్పని జడ్జిమెంట్ చెప్పేశారు. ఎమ్మార్వోపై వేసిన ఎంక్వైరీ అతీగతీ ఉందా. రిపోర్ట్‌ సబ్మిట్‌ చేశారా? గోదావరి పుష్కరాలు లాగే అదీ బుట్టదాఖలు అయిందని ఉమ్మారెడ్డి అన్నారు. సాక్షాత్తూ సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ను విజయవాడ నడిబజారులో చేయి వేస్తే చంద్రబాబుకు రౌడీ రాజ్యంలా కనిపించలేదా అని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. 
 
తప్పు చేస్తే సొంత ఎమ్మెల్యే అయినా చర్యలు తీసుకోమన్నారు. కనీసం జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసైనా బుద్ది తెచ్చుకోమమని చంద్రబాబుకు చెబుతున్నానని ఉమ్మారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఓ అధికారి ఇంటికి వెళ్లి కరెంట్‌ కట్‌ చేశారని ఆమె కంప్లైంట్‌ చేస్తే.. ఈ విషయం సీఎం దృష్టికి  వస్తే తప్పులు చేస్తే చర్యలు తీసుకోమని ఆదేశించారు. చట్టప్రకారం నేరం చేశారంటే అరెస్ట్‌ చేయండి.

యాక్షన్‌ తీసుకోండని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎవరండీ పరిపాలకుడు. నిష్పక్షపాకంగా పరిపాలన చేసింది జగన్‌? చంద్రబాబా? డ్యూటీలో ఉన్న సీనియర్‌ అధికారిని పరాభవిస్తే జగన్‌ లా కేసు పెట్టిస్తే ప్రజలు, ఉద్యోగస్తులు హర్షించేవారు. కానీ, చంద్రబాబు వీళ్లను అందర్నీ సమర్థించుకుంటూ వచ్చారు. ఆరోజున రౌడీ రాజ్యం చంద్రబాబుకు కనబడలేదని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.