ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:39 IST)

మళ్లీ దూరమవుతుందనీ... భార్యపై కత్తితో దాడిచేసిన.. ఎక్కడ?

చిన్నపాటి మనస్పర్థలకే భార్యాభర్తలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. తన భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోతుందని భావించిన ఓ భర్త... ఆమెను హత్యచేయబోయాడు. భర్త చేసిన దాడిలో తృటిలో తప్పించుకున్న భార్య... ఇపుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెద్దారికుంట గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పెద్దపంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(40)కు సోమల మండలం అన్నెమ్మగారిపల్లెకు చెందిన లక్ష్మి(36)తో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. 
 
నాలుగేళ్ల క్రితం కుటుంబకలహాలతో ఈ దంపతులు విడిపోయారు. అప్పటి నుంచి లక్ష్మి కూతురితో కలసి పుట్టింట్లో ఉంటోంది. నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి మేస్త్రీ పనికి వెళ్లిన ఈశ్వరయ్య భార్యకు దగ్గరై వారం క్రితం తన స్వగ్రామమైన పెద్దారికుంటకు తీసుకువచ్చారు. అయితే ఆదివారం ఉదయం లక్ష్మి తల్లిదండ్రులు కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చారు.
 
భార్య మళ్లీ తనకు దూరం అవుతుందనే అనుమానంతో ఈశ్వరయ్య గ్రామ సమీపంలో కొత్తగా నిర్మించిన ఇంటిని చూసొద్దామని లక్ష్మిని తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే కత్తితో నరకబోగా లక్ష్మి తప్పించుకుని పొలాలవైపు పరుగులు తీసింది. వెంబడించిన ఈశ్వరయ్య భార్య మెడపై తీవ్రంగా నరికి పరారయ్యాడు. 
 
తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్న లక్ష్మిని కుటుంబసభ్యులు, గ్రామస్తులు పుంగనూరు ఆస్పత్రికి  తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రూయాకు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.