క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహా యజ్ఞమిది. 4,097 చెత్త సేకరణ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలను అందించేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశుధ్య నిర్వహణ దశలను మొదటి నుండి చివరి వరకు (ఎండ్ టూ ఎండ్ సొల్యూషన్) సంపూర్ణ పరిష్కారంగా చేపట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్ధాల సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌బిన్‌ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్‌బిన్‌ల పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్తను, పొడి చెత్తను, ప్రమాదకర వ్యర్ధాలను సేకరించి 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. 231 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరు వాహనాల (480 కాంపాక్టర్ వెహికిల్స్) ద్వారా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ల వద్దకు చేరుస్తారు. 72 ఐఎస్‌డబ్యూఎం నందు తడి చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు లేక బయోగ్యాస్ తయారీ, పొడిచెత్త నుండి హానికారక వ్యర్ధాలను నిర్మూలించుట, తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకొని రావడం ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ లక్ష్యం.
అలాగే, కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్‌ల కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలను బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా అభివృద్ది పరచుట, గ్రామాలు మరియు నగరాలను పరిశుభ్రంగా మార్చుటం ధ్యేయం. స్వచ్చ సర్వేక్షణ్ వంటి పోటీలలో మన గ్రామాలు, నగరాలను మెరుగైన ఫలితాలను సాధించడం లక్ష్యం.
గ్రామ పంచాయతీలలో 23,000 మంది గ్రీన్ అంబాసిడర్ ల ద్వారా చెత్త సేకరణ, రవాణా, శుద్దీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రత చేస్తారు. కొత్తగా 4,171 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు 14,000 ట్రైసైకిల్స్ పంపిణీ చేస్తున్నారు. అలాగే పది వేలు పైచిలుకు జనాభా ఉన్న గ్రామాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాలలో చెత్త సేకరణ, రవాణా మరింత మెరుగుకు 1,000 ఆటో టిప్పర్ల పంపిణీ చేస్తారు. మాస్కులు, శానిటరీ ప్యాడ్‌లు వంటి వ్యర్ధాల ద్వారా వ్యాధులు ప్రబలకుండా వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించి, పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాల పంపిణీ చేస్తున్నారు.
దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్ల పంపిణీ, 135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్ధాల నిర్వహణ చేస్తున్నారు. 10.645 గ్రామ పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్ కాని వ్యర్ధాలను దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలింపు చేస్తారు. ఈ కార్యక్రమం శాశ్వతంగా, సుస్ధిరంగా, నిరంతరాయంగా కొనసాగాలని, నిర్వహణ ఖర్చులకు మాత్రమే గ్రామాల్లో ఇంటికి రోజుకు కేవలం 50 పైసల నుండి రూ.1 వరకు యూజర్ చార్జీలు వసూలు చేస్తారు.