మారిపోతున్న వ్యతిరేక పరిణామాలు.. సీఎం జగన్ ఛలో ఢిల్లీ
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు హస్తిన బాటపట్టనున్నారు. 30కి పైగా అవినీతి కేసుల్లో చిక్కుకునివున్న జగన్‌కు ఇపుడు ఒక్కొక్కటిగా వ్యతిరేక పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా తనకు వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయని భావించినపుడల్లా ఢిల్లీ పాలకుల శరణువేడుతున్నారు. తాజాగా ఆయన మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు.
గత కొన్ని రోజులుగా ఏపీలోని బీజేపీ నేతల్లోనే కాకుండా కేంద్ర పాలకుల్లో కూడా జగన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్‌ను ఎదుర్కొనేందుకు గట్టి నాయకత్వాన్ని తయారు చేయాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు, వివేకా హత్య కేసులో సీబీఐ అనుబంధ చార్జిషీట్లు వేసింది. అలాగే, తనపై ఉన్న అవినీతి అక్రమ కేసుల్లో కూడా వ్యతిరేక పరిణామాలు ప్రారంభమయ్యాయి. ఈ కేసులను విచారించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కలుసుకుని పూర్తి విధేయత ప్రకటించి, తనపై రాజకీయ చర్యలు తీసుకోకుండా కోరాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, తన బాబాయి వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా చేర్చడంతో పాటు హత్యకు ముందస్తు కుట్ర జరిగిందని అభియోగం మోపింది. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. నిందితులు పాత్రను నిరూపించేలా గూగుల్ టేకౌట్, సీసీటీవీ ఫుటేజ్ తదితర సమాచారంతో సీబీఐ విస్తృత డేటాను కోర్టుకు సమర్పించింది. సెక్షన్ 319 సీఆర్పీసీ ప్రకారం హత్యలో ప్రమేయం ఉన్నట్లు కోర్టు భావిస్తే నిందితులు కాకపోయినా వారి పేర్లు ఏ సమయంలోనైనా చార్జిషీటులో చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకోవైపు, జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జి పిటిషన్లపై 31వ తేదీలోపు వాదనలు ముగించాలని సీబీఐ కోర్టు.. నిందితుల తరపు న్యాయవాదులను ఆదేశించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఈ వాదనలు ముగిస్తే డిశ్చార్జి పిటిషన్లను డిస్మిస్ చేసి విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాజకీయంగా ఎదుర్కోవాలని నిర్ణయిస్తే తనను సమస్యలు చుట్టుముడతాయని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ జగన్ మొర ఆలకించే అవకాశాలు లేవని తెలుస్తోంది. వివేకా హత్యకేసులో పరిణామాలు బీజేపీ అగ్రనేతల దృష్టికి వెళ్లాయని, కొన్ని విషయాల్లో జగన్‌ను మోతాదుకు మించి రక్షిస్తున్నారనే అభిప్రాయం జనంలో బలంగా ఉందని నివేదికలు వెళ్లాయని తెలుస్తోంది.