మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 జూన్ 2023 (13:41 IST)

వైఎస్.షర్మిల... కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం?

sharmila ys
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్.షర్మిళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్ళనున్నారని, కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారనే ప్రచారం సాగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేపీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా హైదారాబాద్ నగరానికి వచ్చి షర్మిళను కలిశారు. అప్పటి నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. ఈ నేపత్యంలో ఇపుడు చివరి దశ చర్చల కోసం ఆమె ఢిల్లీ వెళుతున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
అయితే, ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా లేక కేవలం పొత్తు మాత్రమే పెట్టుకుంటారా అనేది తేలాల్సివుంది. అయితే, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడంపై షర్మిళ కొన్ని షరతులు విధించినట్టు ప్రచారం సాగుతోంది. టీపీసీసీలో కీలక బాధ్యతలు అప్పగించాలని, తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. 
 
పైగా, తాను కోరినవారి టిక్కెట్లు ఇవ్వాలని ఆమె గట్టిగా పట్టుబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ అంగీకరిస్తే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పైగా, ఏపీ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, కేవలం తెలంగాణకే పరిమితమవుతానని ఆమె స్పష్టం చేశారు. ఇలా అన్ని విషయాలపై చర్చించేందుకు ఆమె మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం.