బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (14:50 IST)

జూపల్లి - పొంగులేటి చేరికపై ఉత్తమ్ - కోమటిరెడ్డి ఫైర్ : ఎవరిని అడిగి చేర్చుకుంటున్నారు?

uttam - komatireddy
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీనియర్ నేతలను తిరిగి సొంతగూటికి రప్పించేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా, పార్టీ సీనియర్ నేతలైన పొంగులేటి సుధాకర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై పార్టీ సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. వీరి చేరికపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని ఉత్తమ్, కోమటి రెడ్డి నిలదీస్తున్నారు. సునీల్ కనుగోలు చెప్తే వారిని చేర్చుకోవడమేనా.. మాకు కనీసం మాటమాత్రం సమాచారం ఇవ్వరా అంటూ సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి ఆగ్రహ వ్యక్తం చేశారు. 
 
ఇదిలావుంటే, వచ్చే నెల రెండో తేదీన ఖమ్మంలో జరుగనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేత రాహుల్ గాధీ హాజరుకానున్నారు. ఆయన సమక్షంలో జూపల్లి, పొంగులేటిలు మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందులోభాగంగా, ఈ నెల 25వ తేదీన వారిద్దరినీ టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లి, రాహుల్‌తో భేటీ అవుతారు. 
 
ఆ తర్వాత అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రణాళిక ఖరారైనట్టు సమాచారం. ఇదిలావుంటే, టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం పొంగులేటి సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ఆయన మాజీ మంత్రి జూపల్లిని కూడా కలుస్తారు.