గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (12:21 IST)

నేడు హస్తినకు మంత్రి కేటీఆర్.. హోం మంత్రి అమిత్ షాతో భేటీ!

ktrao
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటనకు శుక్రవారం వెళుతున్నారు. ఆయన రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్న కేటీఆర్.. రెండు రోజుల పాటు అక్కడే ఉండి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశమవుతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
గత కొంతకాలంగా రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, బీజేపీల నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గట్టిపట్టుదలతో కమలనాథులు ఉన్నారు. అయితే, ఆ పార్టీకి అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఇపుడు కీలకంగా మారింది. 
 
గతంలో ఆయన పలుమార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్ర మంత్రులతో సమావేశమై తిరిగి వచ్చారేగానీ, హోం మంత్రి లేదా ప్రధానమంత్రితో కలవలేదు. అయితే, ఈ దఫా మాత్రం చాలా రోజుల తర్వాత ఆయన హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానుండటం ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్టు కేటీఆర్ చెబుతున్నప్పటికీ అమిత్ షాతో జరిగే సమావేశంలో మాత్రం రాజకీయ వ్యవహారాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడంలేదని, పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై మరోమారు ఒత్తిడి తెచ్చేందుకే మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.