బిపర్జాయ్ తుఫాను ఎఫెక్టు - అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదాపడింది. ఈ పర్యటనలో భాగంగా, ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకుని, గురువారం ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో పాటు సినీ నటుడు ఎస్ఎస్ రాజమౌళిల నివాసాలకు వెళ్లి కలుసుకోవాల్సి వుంది. అయితే అరేబియా సముద్రంలో ఉన్న బిపర్జాయ్ తుఫాను ఈ నెల 15వ తేదీన తీరందాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
పైగా, ఈ తుఫాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాలకు పెను ముప్పు తప్పదని ఐఎండీ హెచ్చరించింది. దీంతో తుఫాను ముందస్తు చర్యలను పర్యవేక్షించేందుకు వీలుగా హోం మంత్రి అమిత్ షా తన తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధికారికంగా వెల్లడించారు.
ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ తదుపరి తేదీని తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. వాస్తవానికి గురువారం ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభను నిర్వహించాల్సివుండగా, ఇందులో అమిత్ షా పాల్గొని ప్రసంగించాల్సివుంది. కానీ, ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడంతో ఈ బహిరంగ సభ కూడా వాయిదాపడింది.
మరోవైపు, బిపర్జాయ్ తుఫాను కారణంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటికే తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైవున్నాయి. ఈ రెస్క్యూ బృందాలను హోం మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షించనున్నారు. దీంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.