నిధుల లేమి... మాంసం ముక్క కోసం తల్లడిల్లిపోతున్న ఖైదీలు.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కేంద్ర కారాగారాల్లో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు చికెన్, మటన్ బంద్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ జైళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టరుకు తెలంగాణ జైళ్ల శాఖ రూ.2 కోట్ల మేరకు బాకీ పడిందట. దీంతో ఈ సొమ్ము చెల్లిస్తే గానీ, తాను మాంసం సరఫరా చేయలేనని కాంట్రాక్టర్ మొండికేశారు. దీంతో ఈ రెండు జైళ్లలోని ఖైదీలు చికెన్, మటన్ ముక్కలేక తల్లడిల్లిపోతున్నారు. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది.
ఈ రెండు జైళ్ల నిర్వహణకు నిధుల లేమి ఉత్పన్నమైంది. దీంతో రెండు వారాలుగా ఖైదీలకు చికెన్, మటన్ నిలిపివేశారు. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ.2 కోట్ల మేరకు బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఖైదీలకు మొదటి ఆదివారం మటన్, మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. ఇపుడు నిధుల లేమితో జైళ్లలో మాంసాహారాన్ని నిలిపివేశారు.