శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (16:17 IST)

రచయితలు దర్శకుడిగా మారితేనే లైఫ్ : అన్ స్టాపబుల్ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు

Diamond Ratna Babu
Diamond Ratna Babu
పిల్లా నువ్వులేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'.  'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక.  బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9న  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
ఈ మధ్య కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మీ స్టయిల్ లో హాస్యభరిత సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది ?
ప్రతి రచయిత, దర్శకుడికి వారి బలం ఏమిటని చెక్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నేను చెక్ చేసుకున్న విషయం ఏమిటంటే.. నేను రాసిన పిల్లా నువ్వులేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం లాంటి నవ్వించిన సినిమాలే నాకు పేరుని తీసుకొచ్చాయి. దర్శకుడిగా మారిన తర్వాత ప్రయోగాలు చేశాను. ఫలితాలు ఆశించినట్లు రాలేదు. ఇకపై నా నుంచి ప్రతి ఏడాది ఒక నవ్వించే సినిమా ఖచ్చితంగా వుంటుంది. ఇకపై నవ్వించే సినిమాలే నా నుంచి వస్తాయి. ఒకవేళ ప్రయాగాలు చేయాలనుకుంటే గనుక ఓటీటీలో చేస్తాను.
 
ఒకప్పటి కామెడీ సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు వాటి సంఖ్య తగ్గింది. ఆ ఖాళీ అనేది ఏర్పడింది కదా ?
యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లతో పోల్చుకుంటే కామెడీ సినిమా చేయడం కష్టం. కామెడీ అనేది ఒక స్వీట్ లాంటిది. అది ఎక్కువ పెట్టిన, తక్కువ పెట్టిన సమస్యే. అందుకే ఆ పనిని తీసుకోవడానికి కొందరు వెనకాముందు ఆలోచిస్తుంటారు. జంధ్యాల గారు, ఈవీవీ గారు, రేలంగి గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారు కామెడీలో సక్సెస్ అయ్యారు. రచయితగా నాకు పేరు తీసుకొచ్చింది కామెడీనే. ఇకపై దర్శకుడిగా కామెడీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. 'అన్ స్టాపబుల్' పోస్టర్ నిండా హాస్యనటులు కనిపిస్తారు. దాదాపు ఇండస్ట్రీలోని హాస్యనటులందరినీ పెట్టి రెండుగలపాటు నవ్వించాలనే కృతనిశ్చయంతో తీసిన సినిమా ఇది. అలాగే నిర్మాత రజిత్ రావు సినిమాపై ఒక ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో తొలి చిత్రంగా వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వుండాలనే మంచి ఉద్దేశంతో సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సినిమాలో బ్రహ్మానందం గారు లేరనే లోటు మొన్న ఆయన ట్రైలర్ లాంచ్ చేయడంతో తీరిపోయింది.
 
సన్నీ, సప్తగిరిలతో పని చేయడం ఎలా అనిపించింది ?
సన్నీ, సప్తగిరి.. ఒకరు మచ్చా.. మరొకరు చిచ్చా. వీరిద్దరూ కలసి చేసే రచ్చె జూన్ 9న థియేటర్ లో  అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇందులో సన్నీ మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.  అలాగే సినిమాకి మరో ప్రధాన బలం సప్తగిరి. ఇందులో జిలానీ రాందాస్ గా కనిపిస్తారు. సినిమాని మోసుకెళ్ళే పాత్ర ఆయనది. చాలా అద్భుతంగా చేశారు. సినిమా మంచి స్వీట్ లా వుంది.  
 
'అన్ స్టాపబుల్' కాన్సెప్ట్ ఏమిటి ?
'అన్ స్టాపబుల్' మంచి కాన్సెప్ట్ వుంది. అది ఏమిటనేది ఇప్పుడే చెప్పకూడదు. ఈ సినిమా చూసిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే వుందని అందరూ అభినందించేలా వుంటుంది. ఇందులో ప్రతి పాత్ర కథతో ముడిపడే వుంటుంది.
 
హాస్యం రాసే రచయితలు దర్శకులగా మారిపోవడం వలన కూడా కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయనే అభిప్రాయం వుంది కదా ? అలాగే మీరు రచయితగా వున్నపుడు జర్నీ సేఫ్ గా వుండేది  కదా ?
ప్రతి మనిషికి కెప్టెన్ గా వుండటం ఇష్టం. దర్శకుడైతే మనం అనుకున్నది తీయొచ్చు. అందుకే దర్శకత్వం వైపు రావాల్సి వచ్చింది. ఐతే ఇందులో రిస్క్ లు కూడా వుంటాయి. ఐతే నాకు ఆత్మవిశ్వాసం వుంది. నేను రెండు వేల నోటు కాదు.. వంద నోటు. చిన్నదైనప్పటికీ ఎప్పుడూ చలామణి లోనే వుంటుంది. ఇలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. రచయితగా ఎలా ఐతే నవ్వించానో దర్శకుడిగా కూడా నవ్వించే సినిమాలే చేస్తాను. సింగీతం శ్రీనివాస్ గారు నాకు ఆదర్శం. ఆయనలా వయసు వచ్చే వరకూ నవ్వించాలనే నిర్ణయించుకున్నాను. చివరి వరకూ డైరెక్ట చేయాలనే వుంది. నాకు సినిమా తప్పితే మరొకటి రాదు, తెలీదు.
 
'అన్ స్టాపబుల్' టైటిల్ పెట్టడానికి బాలకృష్ణ గారి స్ఫూర్తి ఉందా?
దర్శకుడిగా నా రెండు సినిమాలు అనుకున్నంత తృప్తిని ఇవ్వలేదు. అలాంటి సమయంలో బాలకృష్ణ గారు 'అన్ స్టాపబుల్' షో  చూశాను. ‘చిత్తశుద్ధి లక్ష్యశుద్ధితో ఏ పని చేసిన ఆ పంచభూతాలు కూడా ఆపలేవు’ అని బాలకృష్ణ గారు చెప్పిన మాట స్ఫూర్తిని ఇచ్చింది. ఆ షో నన్ను నేను రీచెక్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అందుకే ఈ చిత్రానికి 'అన్ స్టాపబుల్' అనే పేరు పెట్టాను. ఆలాగే ఈ టైటిల్ సినిమాకి సరిగ్గా యాప్ట్ అవుతుంది. ఇందులో వుండే పాత్రలు, కథ అన్ స్టాపబుల్ గా వుంటాయి. ఆన్ లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ ఇస్తున్నాం. ఎవరికైనా నవ్వురాకపొతే కాల్ చేయొచ్చని నా నెంబర్ కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పబ్లిక్ లో చెప్పాను. ఈ సినిమా అంతనమ్మకంగా వున్నాం.
 
ఇంతమంది నటీనటల డేట్స్ తీసుకొని నటింపజేయడం ఒక టాస్క్ కదా.. మీరు ఎలా చేశారు?
పెద్ద ప్యాడింగ్ తో తక్కువ రోజుల్లో ఎలా ప్లాన్ చేయాలనేది మొదటే అలోచించుకున్నాం. మా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ చక్కగా పని చేసింది. ముందే షాట్ డివిజన్ చేసుకున్నాం. ఎవరికోసం ఎదురుచూడకుండా ముందు వచ్చిన నటీనటులకు సంబధించిన షాట్స్ ని తీసేవాళ్ళం. దీంతో ఫాస్ట్ గా వర్క్ జరిగింది. అలాగే ఈ చిత్రం కోసం నటీనటులు, నిర్మాత, ఇలా అందరం ఒక టీంలా పని చేశాం.
 
ఈ చిత్రానికి అందరూ హీరోలే. ముఖ్యంగా టెక్నిషియన్స్. ధమాకా, బలగం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన భీమ్స్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కాసర్ల శ్యామ్ సింగిల్ కార్డ్ రాశారు. అలాగే ఎడిటర్ ఉద్దవ్, డీవోపీ వేణు, కాస్ట్యుమ్ డిజైనర్ వినీత ఇలా ప్రతి ఒక్కరు వారి భాద్యతని చక్కగా నెరవేర్చారు.
 
బాలకృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారా ?
ఈ సినిమాని మే 26న రిలీజ్ చేసివుండవచ్చు. జూన్ 2 కూడా చేయొచ్చు, కానీ ఇన్ని రోజులు ఆగాం. బాలకృష్ణ గారి టైటిల్ వుంది. బాలకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తికి అన్ స్టాపబుల్ సినిమా చిన్న చిరు కానుక అవుతుందని జూన్ 9 విడుదల చేయడం జరుగుతుంది. సప్తగిరి ద్వారా ఈ చిత్రానికి ‘అన్ స్టాపబుల్’ అనే టైటిల్ పెట్టామని బాలకృష్ణ గారికి తెలియజేయడం, ఆయన అభినందించడం జరిగింది. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నపుడు కూడా జై బాలయ్య అనే అరుపులు వినిపిస్తాయి. జై బాలయ్య నినాదం మా సినిమాకి ప్లస్ అయి అన్ స్టాపబుల్ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం.
 
మీరు రచయితలకు ఇచ్చే సలహా ?
ఇప్పుడు ప్రతి రచయితలో దర్శకుడు వున్నారు. ఒకరిద్దరికి తప్పితే కేవలం రచయితలైన వారికి ఇప్పుడు అవకాశాలు తక్కువగా వున్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఎవరైతే కథ రాస్తారో వాళ్ళకే దర్శకత్వ అవకాశం వస్తుంది. తెలుగు లో కూడా అది మొదలైయింది. విషయం వుంటే అవకాశం ఇస్తున్నారు. రచయితలు కేవలం రచయితలుగానే కాకుండా దర్శకుడిగా కూడా అలోచించమని చెప్తాను.