మా బావను అపుడపుడూ టీజ్ చేస్తుంటా : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు బావాబావమరుదులు. ఒకరు సిద్ధిపేటకు ఎమ్మెల్యే అయితే మరొకరు సిరిసిల్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ తమతమ నియోజకవర్గాలను పోటీపడీ అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేటలో ఐటీ టవర్ నిర్మాణం జరిగింది. దీని ప్రారంభోత్సవంలో ఈ మంత్రులిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హరీష్ రావు మా బావ. అందుకే అపుడపుడూ టీజ్ చేస్తుంటాను అని అన్నారు. హరీష్ అభివృద్ధి కామకుడని అన్నారు. తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయంగా చాటుతున్న వ్యక్తి కేటీఆర్ అని హరీష్ రావు అన్నారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హరీష్ రావు తన బావ కావడంతో సరదాగా ఏడిపిస్తుంటాను. నేను సిరిసిల్లకు సిద్ధపేట మీదుగానే వెళ్ళాలి. ఇక్కడకు రాగానే హరీష్ రావుకు ఫోన్ చేస్తా. ఏం సంగతి బావా.. మళ్లేదో కొత్తవి కట్టినట్టున్నవ్. కొత్త రోడ్లు వేసినవ్ అని అడుగుతా. దీనికి ఆయన స్పందిస్తూ... ఇక లాభం లేదు. మళ్లోసారి వచ్చినపుడు కళ్లుమూసుకుని పో. ప్రతిసారీ ఏదో ఒకటి అంటున్నవ్ అంటూ సరదాగా బదులిస్తారు అని మంత్రి కేటీఆర్ చమత్కరించారు. ప్రతి ఒక్కరూ అసూయపడేలా సిద్దిపేటన హరీష్ రావు అభివృద్ధి చేశారని, వచ్చే ఎన్నికల్లో లక్షన్నర మెజార్టీతో హరీష్ రావును గెలిపించుకోవాలన్నారు.
ఒకే తూటాకు దంపతుల మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే తూటాకు దంపతులు మృత్యువాతపడ్డారు. భార్య ఫోను పోగొట్టడంతో భర్త తరచూ గొడవపడుతూ వచ్చాడు. ఇదే విషయంపై మంగళవారం కూడా మరోమారు ఆ దంపతులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో భార్యను హగ్ చేసుకున్న భర్త.. నాటు తుపాకీతో భార్య వెన్ను భాగంలో కాల్చాడు. ఈ తుపాకీ బుల్లెట్ భార్య శరీరం నుంచి భర్త శరీరంలోకి కూడా దూసుకొచ్చింది. దీంతో ఒకే తూటాగా భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. భర్త క్షణికావేశంలో చేసిన పనికి వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ పిల్లలను పోలీసులు అనాథాశ్రమానికి తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లా ఖాన్ పూర్ గ్రామానికి చెందిన అనేక్ పాల్ అనే వ్యక్తి రోజూ కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. ఈయనకు భార్య సుమన్, నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం భార్య ఫోన్ పోగొట్టుకోవడంతో దంపతుల మధ్య వివాదం మొదలైంది. ఇటీవలికాలంలో పలుమార్లు వారిద్దరూ గొడవపడ్డారు. మంగళవారం కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన అనేక్ పాల్.. భార్యను గట్టిగా కౌగలించుకుని ఆమె వీపుపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో బుల్లెట్ ఆమె ఛాతిలో నుంచి అనేక్ పాల్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం విని లోపలికొచ్చిన ఇరుగుపొరుగువారు అనేక్ పాల్ దంపతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనాథలైన వారి పిల్లలను సంరక్షణాలయానికి తరలించారు.