శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (19:21 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రులుగా 'ఆ ఇద్దరు'??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 22వ తేదీ బుధవారం చేపట్టనున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వారి స్థానాల్లో మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులోభాగంగా, ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటపై మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉంటుందని సమాచారం. 
 
అయితే, కొత్త మంత్రులు జాబితాలో అనేక మంది పేర్లు ఉన్నారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా, ఈ రెండు బెర్తులను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, మంత్రిపదవుల కోసం ఎమ్మెల్యేలు ఆర్కే. రోజా, అంబటిరాంబాబు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 
 
కానీ, సీఎం జగన్ మనసులో మాత్రం సీదిరి అప్పలరాజు (పలాస ఎమ్మెల్యే), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రామచంద్రపురం ఎమ్మెల్యే)లకు క్యాబినెట్ బెర్తులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని సీఎంవో వర్గాలతో పాటు.. సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు కూడా సూచన ప్రాయంగా వెల్లడిస్తున్నారు.