ఏపీలో వరుస అత్యాచారాలు.. దిశ చట్టం ఏమైదంటూ పవన్ ప్రశ్నలు
నెల్లూరు జిల్లాలోని పెళ్ళకూరు మండలంలో ఓ యువతిపై లైంగిక దాడిజరిగింది. కొందరు వ్యక్తులు శ్రీకాళహస్తి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై పోలీసులు పట్టించుకోకపోవడంతో... మహిళ కమిషన్‌కు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. అలాగే, రాజమండ్రిలో కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తున్న 16 యేళ్ళ బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు.
ఈ రెండు ఘటనలపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. నెల్లూరు, రాజమహేంద్రవరంలో ఇద్దరు యువతులపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచి వేసిందన్నారు.
అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తోందని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని పవన్ కల్యాణ్ కోరారు.
తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సకాలంలో స్పందించలేదని తెలిసిందని తెలిపారు. దిశ చట్టం, ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటన అమానుషం అని పవన్ అన్నారు.